Diesel price burden On RTC: ఏపీఎస్ ఆర్టీసీకి చమురు సంస్థలు షాక్ ఇచ్చాయి. ఇప్పటి వరకు బయట మార్కెట్ కంటే తక్కువ ధరకే డీజిల్ సరఫరా చేసే సంస్థలు.. ఇప్పుడు ధరలు పెంచేశాయి. వారం పదిరోజులుగా బయట విక్రయించే ధర కంటే ఆర్టీసీకి ఇచ్చే ధర లీటర్‌కు రూ.4.30 వరకు చమురు సంస్థలు పెంచేశాయి. దీంతో అన్ని బస్సులకూ బయట (రిటైల్) బంకుల్లో డీజిల్ నింపుకోవాలంటూ ఏపీఎస్ ఆర్టీసీ ఎండీ సీహెచ్. ద్వారకా తిరుమలరావు ఉత్తర్వులు జారీచేశారు.
ఏపీఎస్ ఆర్టీసీలో 10 వేల బస్సులకు నిత్యం సగటున 7.30 లక్షల లీటర్ల (నెలకు దాదాపు 2.2 కోట్ల లీటర్లు) డీజిల్ వినియోగిస్తారు. ఏపీవ్యాప్తంగా 129 డిపోలు ఉండగా, ఆయా చమురు సంస్థలు డిపోలకు డీజిల్ సరఫరా చేస్తాయి. అక్కడ ఆర్టీసీ సొంత బస్సులతోపాటు, అద్దె బస్సులకూ ఈ డీజిల్‌ను నింపుతుంటారు. చమురు సంస్థలు మూల ధరలలో కొంత రాయితీ ఇస్తుంటాయి. దీనివల్ల బయటి బంకులతో పోలిస్తే, ఆర్టీసీకి సరఫరా చేసే డీజిల్ ధర లీటర్‌కు రూ.2 వరకు తక్కువగా ఉండేది.
కొద్ది రోజులుగా బయటి బంకుల్లో విక్రయించే పెట్రోల్, డీజిల్ ధరలు పెరగకుండా స్థిరంగా ఉన్నాయి. డీజిల్ ఆయా జిల్లాలను బట్టి లీటర్ రూ.96 - రూ.97 వరకు ఉంది. అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలోనే వీటిలో హెచ్చుతగ్గులు లేకుండా, స్థిరంగా ఉన్నట్లు చెబుతున్నారు. అయితే అంతర్జాతీయ మార్కెట్‌లో బ్యారెల్ ధర క్రమంగా పెరుగుతుండటంతో ఆర్టీసీకి సరఫరా చేసే డీజిల్‌కు మూల ధరను పరిగణలోకి తీసుకునే చమురు సంస్థలు.. బ్యారెల్ ధర ప్రకారం ధర పెంచినట్లు చెబుతున్నారు. దీంతో లీటర్‌పై బయటి బంకుల్లో ధర కంటే, ఆర్టీసీకి లీటర్‌కు రూ.4.30 ఎక్కువకి సరఫరా చేస్తున్నాయి. దీనివల్ల బయటి బంకుల్లో లభించే డీజిల్ ధరతో లెక్కిస్తే.. ఆర్టీసీ నెలకు దాదాపు రూ.10 కోట్ల మేర నష్టపోవాల్సి వస్తోంది. ఈ పరిణామాలతో ఆర్టీసీ అధికారులు సోమవారం సమీక్ష నిర్వహించారు. కొంత కాలం ఆర్టీసీ డిపోల్లో కాకుండా.. బయటి బంకుల్లో డీజిల్ నింపుకోవాలంటూ ఏపీఎస్ ఆర్టీసీ ఎండీ ఉత్తర్వులు జారీచేశారు. వీటిని వెంటనే అమలు చేయాలని అన్ని జిల్లాల ఆర్‌ఎంలను ఆదేశించారు.
ఇదీచూడండి:దండుమల్కాపురం పారిశ్రామిక పార్కులో తయారీ షురూ