తెలంగాణ

telangana

ETV Bharat / city

DIARY OF COVID-19: నా కథ చెప్తా వింటారా... 'డైరీ ఆఫ్‌ కొవిడ్‌ 19'

DIARY OF COVID-19: కరోనా పేరు వింటేనే చాలా మంది గుండెల్లో వణుకు పుడుతుంది. ఎందుకంటే అది సృష్టించిన మరణ మృదంగం అంతా ఇంతా కాదు. పేదవాడి నుంచి ధనికుల వరకు అందరినీ కలవరపెట్టింది. అయితే కరోనా వైరస్ గురించి ప్రజలకు అవగాహన కల్పించడానికి ఎంతో మంది శాస్త్రవేత్తలు పుస్తకాలు రాశారు. ఇప్పుడు కరోనా గురించి ఎందుకు అనుకుంటున్నారా? అయితే మీరు పొరపడినట్లే. ఎందుకంటే కరోనా మీతో మాట్లాడాలనుకుంటుంది. అదేంటి కరోనా మాట్లాడటమేంటి అని ఆలోచిస్తున్నారా... అయితే "డైరీ ఆఫ్‌ కొవిడ్‌ 19” అనే పుస్తకం చదవాల్సిందే.

DIARY OF COVID-19
డైరీ ఆఫ్‌ కొవిడ్‌ 19

By

Published : Apr 26, 2022, 8:39 PM IST

DIARY OF COVID-19: యావత్‌ ప్రపంచానికి ఈ శతాబ్దంలో వచ్చిన అతిపెద్ద ముప్పు కరోనా. అగ్రరాజ్యాలు సైతం చిగురుటాకుల వణికిపోయాయి. ప్రజల్ని ఇంతలా ఇబ్బంది పెట్టిన కరోనా వైరస్‌ గురించి కొంతమంది వైద్య నిపుణులు, శాస్త్రవేత్తలు పుస్తకాలు రాశారు. అయితే ఏపీలోని గుంటూరు జిల్లాకు చెందిన ఓ ఇంజినీరింగ్ విద్యార్థి మాత్రం కరోనా గురించి వినూత్నంగా పుస్తకం రాసింది. కరోనానే స్వయంగా తన చరిత్ర చెబితే ఎలా ఉంటుందో తెలుసుకోవాలంటే "డైరీ ఆఫ్‌ కొవిడ్‌ 19” పుస్తకంలోకి తొంగి చూడాల్సిందే.

"డైరీ ఆఫ్‌ కొవిడ్‌ 19”

నేటి యువత అంటే సరదాలు, సినిమాలే కాదు. విభిన్నమైన నైపుణ్యాలకు ప్రతీకలుగా నిలిచే వాళ్లూ ఉంటారు. అలాంటి కోవలోకే వస్తుంది గుంటూరుకి చెందిన గాయత్రిబాల. కేవలం మూడు నెలల్లోనే "డైరీ ఆఫ్ కొవిడ్ 19” అనే పుస్తకం రచించింది. ఈ పుస్తకం ప్రత్యేకత ఏమిటంటే.. కరోనా వైరసే మనతో మాట్లాడుతున్నట్లుగా ఉంటుంది. కరోనా సమయంలో ఆన్‌లైన్ తరగతులు మధ్యాహ్నం 12 గంటలకు పూర్తయ్యేవి. ఆ తర్వాత సమయం పుస్తకం రాయడం కోసమే కేటాయించింది గాయత్రిబాల. ఈమెకి చిన్నప్పటినుంచే కవితలు రాయడం అలవాటు. అలాగే పాఠశాల, కళాశాలలో జరిగే వ్యాసరచన పోటిల్లో పాల్గొనేది.

రచనలే కాక సంగీతం, కళల్లోనూ సైతం గాయత్రిబాల రాణిస్తోంది. కరోనా మొదటి విడత చేసిన విధ్వంసాన్ని ఈ పుస్తకంలో వివరించారు. కొవిడ్‌ టీకా రావడంతో కరోనా భయపడటం, తనకి తాను నాశనం కావాలని బెర్ముడా ట్రయాంగిల్ ప్రాంతానికి వెళ్లిపోవాలని భావించడం, డైరీలో పేజీలు అయిపోవడంతో పాఠకుల నుంచి కరోనా వీడ్కోలు తీసుకోవడం లాంటి ఆసక్తికరమైన విషయాల్ని జోడించింది.

కరోనా పుస్తకం రాయడం పూర్తయ్యాక దాన్ని ఎలా ప్రజల్లోకి చేర్చాలనే చర్చ మొదలైంది. ఇందుకోసం ప్రచురణ సంస్థలను సంప్రదించగా.. కెనడాకు చెందిన యుకియోటో పబ్లిషింగ్ హౌస్ ఈ పుస్తకం ముద్రించేందుకు ముందుకు వచ్చింది. ఈ ఏడాది ఫిబ్రవరి 27 న పుస్తకం మార్కెట్‌లోకి వచ్చేసింది.

"కరోనా యాక్టివిటిస్​ మీద ఎవరైనా బుక్ రాస్తే బాగుండు అని మా పేరెంట్స్ అన్నారు. ఎవరో రాయడం ఎందుకులే అని నాకే రాయాలనిపించింది. చిన్నప్పటి నుంచి మంచి స్టోరీస్ రాయాలని ఉంది. ఇప్పుడు మంచి స్టోరీ దొరికిందని రాశాను. కరోనా పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి ఎవరూ బుక్ రాయలేదు. కరోనాని విలన్ చేసి రాయడం లేదా కొవిడ్​ వల్ల మేము ఇలా ఉన్నాము అని రాయడమే కానీ కరోనా ఏమి అనుకుంటుంది అనే కోణంలో ఎవరూ రాయలేదు. అందుకే భిన్నంగా ఉంటుందని కొవిడ్​ని హీరోగా చేసి రాశాను. నార్మల్​గా మనిషి ఎలా ఆలోచిస్తాడో అలానే రాశాను.

ఈ పుస్తకాన్ని మాములుగానే ముద్రించుకుందామనుకున్నా కానీ మా అమ్మ అందుకు ఒప్పుకోలేదు. కొంచెం మంచి పబ్లిషర్​ని సంప్రదించి.. పబ్లిష్ చేస్తే విలువ ఉంటుందని అన్నారు. ఇక అప్పటినుంచి చాలా మందిని కలిశాను. కానీ కొంతమంది కండిషన్స్ నచ్చక రిజెక్ట్ చేశాను. ఇప్పుడు ఫైనల్లీ యుకియోటో అనే సంస్థ కండీషన్స్ నచ్చి ఒకే చెప్పాను. మేమే పబ్లిష్ చేసి రాయల్టీ ఇస్తామని ఆ సంస్థ వాళ్లు చెప్పారు.

ఆ సంస్థ కెనడాకు సంబంధించింది కానీ ఇండియాలో ఉండే వాళ్లు దానిని పబ్లిష్ చేశారు. ఈ బుక్​కి రాయల్టీ కింద ఇరవై రూపాయలు ఇస్తున్నారు. అదే హార్డ్ కాపీ అయితే సుమారు 230 రూపాయలు ఇస్తారు." -గాయత్రిబాల, "డైరీ ఆఫ్‌ కొవిడ్‌ 19” పుస్తక రచయిత

గాయత్రిబాల స్వస్థలం ఏపీలోని గుంటూరు జిల్లా రేపల్లే. తల్లిదండ్రులు ఒమన్‌లో ఉద్యోగాలు చేయడంతో అక్కడే పెరిగింది. ఇప్పుడు వారితో పాటే గుంటూరు వచ్చి ఇంజినీరింగ్ చదువుతోంది. తమ కుమార్తె కరోనా గురించి పుస్తకం రాయడంపై సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

"డైరీ ఆఫ్ కొవిడ్-19 అనే పుస్తకాన్ని మేము మస్కట్​లో ఉండగానే మా అమ్మాయి రాసింది. ఇది రాయడానికి ముఖ్య కారణం కొవిడ్ సెలవుల్లో ఇంట్లో ఉండటం , అలాగే ప్రతిరోజు వాట్సాప్​లో కొవిడ్ మీద వచ్చే వార్తలు, కార్టూన్​లు చూసి ఒక సబ్జెక్ట్​గా, కరోనాను క్యారెక్టర్​గా ఎంచుకొని తనకున్న నైపుణ్యంతో చిన్న చిన్న స్టోరీస్ రాయడం మొదలుపెట్టింది" -వెంకటేశ్వరరావు, గాయత్రి తండ్రి

"మా అమ్మాయి 15 పేజీలు రాసిన తర్వాత నాకు చదవడానికి ఇచ్చింది. అది చదివి నాకు ఆశ్చర్యం అనిపించింది. చాలా బాగా రాశావు.. ఇంకా అలాగే రాయమని చెప్పాను. అలా ఇంకో 50పేజీలు చదివిన తర్వాత నాకు ఇంకా నచ్చింది. ఎందుకంటే అందులో అన్ని రకాల ఎమోషన్స్ ఉన్నాయి. ఈ పుస్తకం కరోనా గురించి కాదు. ఒకవేళ కొవిడ్ అనేది మనిషి అయితే తన డైరీ ఎలా ఉంటుందో అలా ఉంది" -నటరాజకుమారి, గాయత్రి తల్లి

గాయత్రి 7భాషల్లో మాట్లాడగలదు. మొదటినుంచే చదువుతో పాటు ఇతర కార్యక్రమాల్లోనూ ముందంజలో ఉండేది. వయోలిన్, గిటార్‌, పియానో కూడా నేర్చుకుంది. కళాశాలలో జరిగే సాంస్కృతిక కార్యక్రమాల్లోను ఉత్సాహంగా పాల్గొంటుంది. తాను కూడా వెంట్రిలాక్విజం ద్వారా అందరినీ అలరిస్తోంది. గాయత్రి ఇంటర్‌ చదువుతున్న సమయంలోనే.. ఆన్‌లైన్‌ దినపత్రికలు, వెబ్‌సైట్ల ద్వారా కరోనాకి సంబంధించిన సమాచారం సేకరించింది. అవన్నీ క్రోడీకరించి కరోనా కోణంలో 400 పేజీలకు పైగా రచన సాగించింది. గాయత్రి విదేశాల్లోనే పుట్టి, పెరగడంతో.. ఎప్పటికైనా ఇండియన్‌ ఫారెన్ సర్వీస్‌ అధికారిగా.. విదేశాల్లో దేశం తరపున పని చేయడమే లక్ష్యంగా పెట్టుకుంది.

ఇదీ చదవండి:టిమ్స్ ఆసుపత్రులకు కేసీఆర్ శంకుస్థాపన.. ఏడాదిలోగా అందుబాటులోకి సేవలు

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details