Chetak diamond jubilee : వాయుసేనలో 60 ఏళ్లుగా నిర్విరామంగా సేవలందిస్తోంది చేతక్ హెలికాప్టర్. ఆరు దశాబ్ధాలుగా వాయుసేనలో కొనసాగుతున్న ఈ హెలికాప్టర్‌ను ఆర్మీ, కోస్ట్‌గార్డ్‌లోనూ దీన్ని వినియోగిస్తున్నారు. ఇప్పటి వరకు ఎన్నో ఆపరేషన్లలో పాలుపంచుకుంది. దేశ సేవలో నిర్విరామంగా ఆరు దశాబ్దాలు పూర్తి చేసుకున్న సందర్భంగా భారత వాయుసేన ప్రత్యేకంగా చేతక్ హెలికాప్టర్‌కు డైమండ్‌జూబ్లీ ఉత్సవాలను హకీంపేట ఎయిర్‌ఫోర్స్ అకాడమీలో నిర్వహిస్తోంది. ఉగాది రోజు జరిగే వేడుకలకు రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ ముఖ్యఅతిథిగా హాజరు కానున్నారు.
చరిత్ర ఘనం :పాత తరం హెలికాప్టరే అయినా ఎంతో చరిత్ర చేతక్ సొంతం. బహుళ ప్రయోజనకారిగా కార్గో, ట్రాన్స్‌పోర్ట్, అత్యవసర వైద్యం, సెర్చ్, ఏరియల్ సర్వే, పెట్రోలింగ్, ఆఫ్ షోర్ ఆపరేషన్లలో కీలక పాత్ర పోషించింది. బెంగళూరులోని హిందుస్థాన్ ఎరోనాటిక్స్ లిమిటెడ్ (హెచ్‌ఏఎల్) దీన్ని ఉత్పత్తి చేస్తోంది. 1965లో మొదటి హెలికాప్టర్‌ను తయారు చేశారు. టర్బో షాఫ్ట్ ఇంజిన్‌తో పనిచేస్తుంది. ఇప్పటివరకు హెచ్‌ఏఎల్ 350 వరకు హెలికాప్టర్లను మన దేశంతో పాటూ విదేశాలకూ విక్రయించింది.