తెలంగాణ

telangana

ETV Bharat / city

నేరుగా గస్తీ బృందానికే డయల్‌ 100 సమాచారం - Hyderabad latest news

ప్రమాదంలో ఉన్నప్పుడు ప్రతి క్షణం విలువైనదే. అందుకే ఆపదలో ఉన్నవారు ఫోన్‌ చేయగానే సాధ్యమైనంత త్వరగా వారిని చేరుకునేందుకు పోలీసులు అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. తమను కాపాడమని బాధితులు ఫోన్‌ చేసినప్పటి నుంచి వారిని చేరుకునే ప్రస్తుత సగటు సమయం 8 నిమిషాలు. దీన్ని తగ్గించేందుకు కృషి చేస్తున్న అధికారులు ఇప్పుడు డయల్‌ 100కు మరో హంగు సమకూర్చారు. బాధితులు ఫోన్‌ చేయగానే దాన్ని వారికి సమీపంలో ఉన్న గస్తీ వాహనానికి మళ్లిస్తారు. దీనివల్ల సమస్య పట్ల పోలీసులకు స్పష్టత రావడంతోపాటు మరింత వేగంగా అక్కడకు చేరుకునే వీలుంటుంది. త్వరలోనే ఇది అందుబాటులోకి రానుంది.

Further modernization in patrol vehicles
గస్తీ వాహనాల్లో మరింత ఆధునికీకరణ

By

Published : Mar 8, 2021, 9:09 AM IST

వివిధ సమస్యలతో సగటున ప్రతి నెలా డయల్‌ 100కు లక్షకుపైగా కాల్స్‌ వస్తుంటాయి. గత ఏడాది 12.42 లక్షలు వచ్చాయి. దిశ ఉదంతం తర్వాత లొకేషన్‌ బేస్డ్‌ సర్వీస్‌ (ఎల్‌బీఎస్‌) అందుబాటులోకి తెచ్చారు. దీనివల్ల బాధితులు ఫోన్‌ చేసినప్పుడు జీపీఎస్‌ ఆధారంగా వారు ఎక్కడున్నారనేది కాల్‌సెంటర్లో కంప్యూటర్‌ స్క్రీన్​ మీదేకాకుండా.. వారికి దగ్గర్లో ఉన్న గస్తీ బృందంకూ కనిపిస్తుంది.

తగ్గించే ఉద్దేశంతో..

ముందు కాల్‌సెంటర్‌ ఉద్యోగులు బాధితులతో మాట్లాడి, వివరాలు తెలుసుకొని వాటిని సమీపంలోని గస్తీ బృందానికి చెబుతున్నారు. ఆ సమాచారం ఆధారంగా బృందం వారిని చేరుకుంటోంది. అందుకే రాష్ట్ర వ్యాప్తంగా సగటు రెస్పాన్స్‌ ప్రస్తుత సమయం 8 నిమిషాలుగా ఉంది. దీన్ని మరింత తగ్గించే ఉద్ధేశంతో డయల్‌ 100ను ఇంకాస్త ఆధునికీకరిస్తున్నారు.

బాధితులు చేసిన ఫోన్‌ను సరాసరి వారికి సమీపంలో ఉన్న గస్తీ బృందం వద్ద ఉన్న టీఎస్‌ కాప్‌ యాప్‌కు మళ్లించనున్నారు. బాధితులు తమ దగ్గర్లోని బృందంతో మాట్లాడవచ్చు. ఇంతకు ముందున్న మూడంచెల పద్ధతికి (బాధితులు-కాల్‌సెంటర్‌-గస్తీబృందం) బదులు రెండంచెల పద్ధతి (బాధితులు-గస్తీబృందం) ఏర్పడనుంది.

త్వరలోనే అమలు..

గస్తీ బృందం వారే స్వయంగా మాట్లాడతారు కాబట్టి బాధితులకు ఎలాంటి సహాయం కావాలనే స్పష్టత వారికి ఏర్పడుతుంది. దాన్నిబట్టి అవసరమైతే అదనపు బలగాలు, అంబులెన్సు వంటి వాటినీ రప్పించుకోవచ్చు. ప్రస్తుతం ప్రయోగాత్మక దశలో ఉన్న ఈ కొత్త ప్రక్రియను త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయనున్నారు.

మరింత ఆధునికీకరణ..

తర్వాతి దశలో బాధితులు, గస్తీ బృందం వారు పరస్పరం ఎక్కడున్నదీ తమ ఫోన్లో చూసుకునే వెసులుబాటు మున్ముందు అందుబాటులోకి రానుంది. అంటే ఆపదలో ఉన్న వారు 100కు ఫోన్‌ చేయగానే దగ్గర్లో ఉన్న వారికి బృందం మ్యాప్‌లో కనిపిస్తుంది. దానివల్ల వాళ్లు ఎంతదూరంలో ఉన్నారు, ఎక్కడ వరకూ వచ్చారు, ఎంతసేపట్లో వస్తారు అనే వివరాలన్నీ బాధితులకు తెలుస్తాయి.

అలాగే బాధితులు ఎక్కడున్నారనేది గస్తీ బృందం వద్ద ఉన్న ట్యాబ్‌లో కనిపిస్తుంది. దీనివల్ల ఎలాంటి గందరగోళం లేకుండా బృందం వారిని చేరుకోవడానికి ఆస్కారం ఉంటుంది.

ఇదీ చూడండి:భైంసాలో చెలరేగిన అల్లర్లు

ABOUT THE AUTHOR

...view details