కర్ణాటకలోని నేత్రావతి నదీ తీరంలో ‘మంజునాథాయ నమః’ అంటూ నినదించే భక్తజనఘోషతో అలరారే క్షేత్రం ధర్మస్థల మంజునాథస్వామి ఆలయం. జైనులు నిర్మించిన ఈ ఆలయంలో మంజునాథుడి రూపంలో దర్శనమిచ్చే శివుడు... భక్తుల కోర్కెలు తీర్చే కొంగుబంగారంగా పూజలు అందుకుంటున్నాడు. వైష్ణవులు అర్చకులుగా వ్యవహరించే అరుదైన శైవక్షేత్రం ఇదేననీ... ఆ సన్నిధానం ఎన్నో సేవా కార్యక్రమాలకు నెలవనీ అంటారు. శైవక్షేత్రం అనగానే... శివలింగం, నంది విగ్రహాలే ఎక్కువగా ఉంటాయి. కానీ మంజునాథ ఆలయంలో ఈ రెండే కాకుండా నలుగురు ధర్మదేవతల్నీ, జైనులు ఎంతో భక్తిశ్రద్ధలతో కొలిచే బాహుబలి విగ్రహాన్నీ దర్శించుకోవచ్చు. కార్తిక మాసంలో నిర్వహించే లక్ష దీపోత్సవాన్నీ చూసేందుకు రెండు కళ్లూ చాలవంటారు. సుమారు ఎనిమిది వందల సంవత్సరాల నుంచి ఉన్న ఈ ఆలయంలోని పరమేశ్వరుడిని హెగ్గడే కుటుంబానికి చెందిన జైనులు ప్రతిష్ఠించడంతో పాటు అప్పటినుంచీ వాళ్ల వారసులే ఆలయ బాధ్యతల్ని చూస్తున్నారు. శ్రీ క్షేత్రంగా, ధర్మస్థలగా గుర్తింపు పొందిన ఈ ఆలయంలో వైష్ణవులే అర్చకులుగా ఉండటం విశేషం.
స్థలపురాణం..
ధర్మస్థలను ఒకప్పుడు కుడుమ అని పిలిచేవారు. ఇక్కడ నివసించే బీర్మన్న పెర్గడే, అతని భార్య అమ్ము బల్లాల్తీ ధర్మబద్ధంగా నడుచుకుంటూ ఎన్నో సేవాకార్యక్రమాలను చేసేవారు. ఓ రోజు వీళ్ల ఇంటికి ధర్మదేవతలుగా పిలిచే కాలరాహు, కలర్కాయ్, కుమారస్వామి, కన్యాకుమారిలు మారువేషంలో రావడంతో ఈ జంట ఎప్పటిలానే ఆదరించింది. ఆ రాత్రి బీర్మన్నకు ఈ ధర్మదేవతలు కలలో కనిపించి తమ గురించి తెలియజేసి ఆ కుటుంబం ఉంటున్న ఇంటిని ధర్మస్థాపనకు ఉపయోగించుకోవాలనుకున్నట్లుగా వివరించడంతో మర్నాడే బీర్మన్న తనవాళ్లందరినీ తీసుకుని ఇల్లువదిలి వెళ్లిపోయాడట. కొన్నాళ్లకు మళ్లీ ఆ దేవతలే బీర్మన్నకు కలలో కనిపించి తమ విగ్రహాలను ప్రతిష్ఠించమని చెప్పడంతో... తన ఇంటికి తిరిగి వచ్చి వాళ్లు చెప్పినట్లుగా చేశాడట. ఆ సమయంలో పూజాది కార్యక్రమాలను నిర్వహించేందుకు వచ్చిన బ్రాహ్మణులు ఇక్కడ శివలింగం కూడా ఉంటే మంచిదని సూచించడంతో అన్నప్ప అనే మరో భక్తుడు ప్రత్యేకంగా శివలింగాన్ని తీసుకొచ్చి ప్రతిష్ఠించాడట. కొన్నాళ్లకు భీర్మన్న వంశానికి చెందిన దేవరాజ హెగ్గడే అనే భక్తుడు ఉడిపికి చెందిన వరదరాజస్వామి అనే పీఠాధిపతిని ఈ ఆలయానికి ఆహ్వానించాడట. ఆ స్వామీజీ శివలింగానికి విశేషమైన పూజాకార్యక్రమాలను నిర్వహించి ఇక్కడ జరుగుతున్న మంచిపనుల్ని చూసి ఈ ప్రాంతానికి ధర్మస్థల అనే పేరు పెట్టాడనీ, అప్పటినుంచీ ఈ క్షేత్రం గురించి అందరికీ తెలిసిందనీ అంటారు.
ఎన్నో సేవాకార్యక్రమాలు...