తెలంగాణ రాష్ట్ర రాజకీయ ఉద్దండుల్లో ధర్మపురి శ్రీనివాస్(DS) ఒకరు. కాంగ్రెస్‌లో రాష్ట్రం నుంచి సోనియాగాంధీని నేరుగా కలిసే వ్యక్తుల్లో డీఎస్ ఒకరిగా ఉండేవారు. అయితే రాష్ట్ర విభజన తర్వాత పరిస్థితులు తారుమారు కావడం, కాంగ్రెస్ తీసికట్టుగా మారిపోవడంతో 2015లో డీఎస్ తెరాస గూటికి చేరారు. మొదట ప్రభుత్వ సలహాదారుగా.. ఆ తర్వాత రాజ్యసభ సభ్యుడిగా పదవి వరించింది. అయితే ఆ తర్వాత కొంతకాలానికి జిల్లా తెరాస ఎమ్మెల్యేలతో సఖ్యత లేకపోవడం, రానురానూ పార్టీలో ప్రాధాన్యం తగ్గుతూ వచ్చింది. ఇదే సమయంలో డీఎస్ కుమారుడు అర్వింద్ భాజపాలో చేరి ఎంపీగా పోటీ చేశారు. సిట్టింగ్ ఎంపీగా ఉన్న కవిత మీద అర్వింద్ గెలిచారు. ఆయన గెలుపు వెనక డీఎస్ ఉన్నారని తెరాస అధ్యక్షుడు కేసీఆర్‌కు జిల్లా నేతలు తీర్మానం పంపించారు. అప్పటి నుంచి మౌనం వహిస్తూ వచ్చారు. పార్టీ ఏదైనా నిర్ణయం తీసుకుంటుందేమోనని డీఎస్ ఎదురు చూశారు. అలాంటిదేమీ జరకగపోవడంతో పార్టీతో అంటీముట్టనట్లుగా వ్యవహరిస్తూ వచ్చారు. తెరాస అధిష్ఠానం సైతం డీఎస్‌ను పక్కన పెట్టేసింది.
నేతల వరుస భేటీలతో ఆసక్తి..
ఇక్కడి వరకు బాగానే ఉన్నా... ఇటీవల జరుగుతున్న పరిణామాలతో డీఎస్ దారెటు అన్న చర్చ ప్రారంభమైంది. ఇటీవల కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్ రెడ్డి.. డి.శ్రీనివాస్‌ను కలిశారు. ఇంట్లో ప్రమాదానికి గురైన డీఎస్‌ను రేవంత్ పరామర్శించారు. ఇటీవల ఉపఎన్నికల్లో ఘన విజయం సాధించిన ఈటల రాజేందర్ సైతం డీఎస్‌ను కలిశారు. సుదీర్ఘంగా వారితో చర్చించారు. ఆ సమయంలో డీఎస్ తోపాటు ఎంపీ అర్వింద్ సైతం ఉండటం గమనార్హం. రేవంత్ కలిసిన సమయంలో డీఎస్ కాంగ్రెస్‌కు తిరిగి వస్తారని అంతా చర్చించుకున్నారు. ఇప్పుడు ఈటల కూడా కలవడంతో భాజపాలో చేరుతారన్న వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం డీఎస్ తెరాస నుంచి రాజ్యసభ సభ్యుడిగా ఉండగా.. మరో ఎనిమిది నెలల్లో ఆయన పదవీ కాలం ముగుస్తుంది. ఇక తన పెద్ద కుమారుడు సంజయ్ కాంగ్రెస్‌లో ఉండగా.. చిన్న కుమారుడు అర్వింద్ భాజపా ఎంపీగా ఉన్నారు. మరి ఈ నేపథ్యంలో డీఎస్ ఎటు మొగ్గు చూపుతారన్న అంశం ఆసక్తికరంగా మారింది.
హస్తం పూర్వ వైభవానికి..
డీఎస్ రాజకీయ వ్యూహాల గురించి కాంగ్రెస్ నేతలందరికీ తెలుసు. అలాగే ఎన్నికల సమయంలో తండ్రి వెంటే ఉండి రాజకీయాలను పరిశీలించిన కుమారులిద్దరికీ తెలుసు. అందుకే రేవంత్ పీసీసీ పగ్గాలు చేపట్టిన తర్వాత మొదటిసారి డీఎస్ పరామర్శించేందుకు వచ్చినప్పుడే ఇద్దరి మధ్య రాజకీయాలపై చర్చ జరిగింది. కాంగ్రెస్ పార్టీ ప్రస్తుత పరిస్థితి, తిరిగి పూర్వ వైభవం సాధించాలంటే చేయాల్సిన పనుల గురించి చర్చించినట్లు సమాచారం. ఆ సమయంలో తిరిగి కాంగ్రెస్‌కు రావాలని రేవంత్ ఆహ్వానించినట్లుగా ప్రచారం జరిగింది. ఆ తర్వాత పార్టీ సీనియర్ నేతలు జానారెడ్డి, సుదర్శన్ రెడ్డిలు సైతం డీఎస్‌ను కలిశారు. ఆ సమయంలోనే పార్టీకి తిరిగి రావడంపై చర్చ వచ్చినట్లుగా తెలిసింది. ఆ సమయంలో డీఎస్ కాంగ్రెస్‌లో చేరొచ్చన్న వార్తలు వినిపించినా.. డీఎస్ మాత్రం మౌనం వీడలేదు.