పారదర్శకతకు పెద్దపీట వేస్తూ, కాళ్లరిగేలా కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా వ్యవసాయ, వ్యవసాయేతర ఆస్తుల రికార్డుల నమోదు.. నిర్వహణలో సరికొత్త విధానానికి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. స్లాట్ బుకింగ్ నుంచి పాస్‌బుక్ పొందే వరకు అన్నీ ఆన్‌లైన్‌లో పొందే అవకాశం ధరణి పోర్టల్‌తో అందుబాటులోకి తెచ్చింది. క్రయవిక్రయాలతో పాటు వివిధ సేవలకు ఈ పోర్టల్‌నే వేదికగా మార్చింది. రెండు నెలలుగా ఆగిన రిజిస్ట్రేషన్లు కూడా తిరిగి ప్రారంభమయ్యాయి. వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లన్నీ 570 తహసీల్దార్ కార్యాలయాల్లో, వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లు 141సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాల్లో చేసేలా ఏర్పాట్లు చురుగ్గా జరుగుతున్నాయి. ఇందుకు సంబంధించి ఇప్పటికే 1.61కోట్ల సర్వే నెంబర్లకు సంబంధించిన ఆస్తులను ధరణిలో నిక్షిప్తం చేశారు. 1.001కోట్ల వ్యవసాయేతర ఆస్తులు, 1.42 కోట్లఎకరాల సాగు భూములు ఇందులో ఉన్నాయి. మొత్తంగా సుమారు 2.6 కోట్లకు పైగా ఆస్తుల వివరాలు అందుబాటులోకి తీసుకువచ్చారు.
క్రయవిక్రయాలకు అనుగుణంగా..
ధరణి పోర్టల్‌లో వ్యవసాయ, వ్యవసాయేతర ఆస్తుల వివరాలు ఒకేచోట లభించనున్నాయి. రికార్డులను స్వయంగా పరిశీలించుకోవడంతో పాటు.. కావాల్సిన వారికి డౌన్‌లోడ్ చేసుకునే అవకాశం కల్పించారు. ఏ వివరాలకూ తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లాల్సిన పని లేకుండా.. రిజిస్ట్రేషన్‌కు అవసరమైన ప్రక్రియ పూర్తి చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్ అయిన వెంటనే కొన్నవారి పేరుతో రికార్డులో పేరు మార్పు- మ్యుటేషన్ చేసుకునే సదుపాయం కల్పించారు. క్రయవిక్రయాలకు అనుగుణంగా రికార్డుల్లో వెంటనే మార్పులు చేసుకునే ఏర్పాట్లు చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆస్తుల పరిరక్షణతోపాటు.. అవినీతికి ఆస్కారంలేని విధంగా చర్యలు చేపట్టారు.
జాప్యానికి ముగింపు..
పాస్‌పుస్తకాల జారీలో జాప్యానికి ధరణితో ముగింపు పడింది. పట్టాదారు పాసుపుస్తకం నంబరు లేదా జిల్లా, మండలం, గ్రామం ఖాతా సంఖ్య లేదా సర్వే నంబరు/సబ్‌డివిజన్ సంఖ్య నమోదు చేస్తే భూములు వివరాలు వస్తాయి. ఇందులో పట్టాదారు పాసుపుస్తకం, 1-బి నమూనా-ఆర్వోఆర్ , పహాణి/అడంగళ్‌లు అందుబాటులో ఉన్నాయి. ధరణితో ప్రభుత్వ భూముల గుర్తింపు కూడా సులభతరం కానుంది. జిల్లా, మండలం, గ్రామం పేరు నమోదు చేస్తే.. గ్రామ పరిధిలో సర్వే నంబర్ల వారీగా ప్రభుత్వ భూములు, దేవాదాయ భూములు, అసైన్డ్ భూములు, లావుణిపట్టా, కెనాల్, శ్మశానం, రోడ్డు, సీలింగ్ పట్టా భూమి స్వభావం, వర్గీకరణ వివరాలు అందుబాటులో ఉన్నాయి.