NARCOTIC CONTROL CELL : మావోయిస్టులను ఏరివేతకు రూపొందించిన గ్రేహౌండ్స్ దేశ వ్యాప్తంగా పేరొందింది. సుశిక్షుతులైన కానిస్టేబుళ్లు, ఎస్సైలకు ప్రత్యేక శిక్షణ ఇచ్చి అడవుల్లో వాళ్లతో ఉన్నతాధికారులతో కలిసి కూంబింగ్ చేయిస్తున్నారు. ఛత్తీస్‌గఢ్, ఒడిశా, మహారాష్ట్ర నుంచి మావోయిస్టులు రాష్ట్రంలోకి అడుగు పెట్టనీయకుండా అడ్డుకోవడంలో సఫలమవుతున్నారు. గ్రేహౌండ్స్ పనితీరు గురించి తెలుసుకొని ఆయా రాష్ట్రాల్లోని పోలీసులు సైతం అదే తరహాలో ప్రత్యేక పోలీసులను ఏర్పాటు చేశారు. టెర్రరిస్టులను అడ్డుకోవడానికి ఇంటిలిజెన్స్ విభాగంలో స్పెషల్ ఇంటిలిజెన్స్ బ్యూరోతో పాటు... కౌంటర్ ఇంటిలిజెన్స్, అక్టోపస్‌ను ఏర్పాటు చేశారు. తీవ్రవాదుల కార్యకలాపాలను ముందస్తుగా గుర్తించడంలో ఇవి ఎంతో కీలక పాత్ర పోషిస్తున్నాయి. కౌంటర్ ఇంటిలిజెన్స్ ఇచ్చిన సమాచారంతో సెంటర్ ఇంటిలిజెన్స్ పోలీసులు ఇతర రాష్ట్రాల్లోనూ ఉగ్రవాద కార్యకలాపాలను అడ్డుకుంటున్నారు.
ఇక వ్యవస్థీకృత నేరాల్లో మాదక ద్రవ్యాలది మొదటి స్థానం. శాంతిభద్రతల సమస్యకు పెను ప్రమాదంగా మారే ప్రమాదం ఉందని పోలీసులు ప్రభుత్వానికి నివేదించారు. ఇప్పటికే పలు రాష్ట్రాలు డ్రగ్స్ బారిన పడ్డాయి. హైదరాబాద్‌లోనూ మాదక ద్రవ్యాల వినియోగం క్రమంగా పెరుగుతున్నట్లు ఇంటిలిజెన్స్ నివేదికలు సైతం తేల్చాయి. రాష్ట్రంలోని మారుమూల గ్రామాలకు గంజాయితో పాటు ఇతర మత్తు పదార్థాలు చేరుతుండటాన్ని ప్రభుత్వం సవాలుగా తీసుకుంది. దీంతో మాదక ద్రవ్యాల అడ్డుకట్టకు శ్రీకారం చుట్టింది. సీఎం కేసీఆర్ ఇప్పటికే రెండుసార్లు పోలీసు, ఎక్సైజ్ ఉన్నాతాధికారులతో సమీక్ష నిర్వహించి దిశానిర్దేశం చేశారు. హైదరాబాద్ పోలీసులు తదనుగుణంగా రెండు ప్రత్యేక విభాగాలను ఏర్పాటు చేశారు. నార్కోటిక్ ఎన్ఫోర్స్మెంట్వింగ్, నార్కోటిక్ ఇన్వెస్టిగేషన్ సూపరివిజన్వింగ్లు మాదక ద్రవ్యాల వినియోగం, సరఫరాను అడ్డుకోవడానికి పనిచేయనున్నాయి.
గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని తెలంగాణ రాష్ట్రంలో ఒక మంచి ఆర్గనైజేషనల్ ఫ్రేమ్ వర్క్‌ను రూపొందించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ సూచించారు. దాదాపు వెయ్యి మంది పోలీసు అధికారులు, సిబ్బంది నియామకానికి అనుమతి ఇవ్వడమే కాకుండా.. అందుకు కావాల్సిన సాంకేతికతను సమకూర్చుకోవడం, ఇతర వ్యవస్థలను నిర్మించాలని ఆదేశించారు. వాటి ఆధారంగా గత పదిరోజులుగా పలువురితో చర్చలు జరుపుతున్నాం. వాటన్నింటిక సంబంధించిన వివరాలను త్వరలోనే ప్రభుత్వం ముందు ఉంచుతాం. -మహేందర్ రెడ్డి, డీజీపీ
నార్కోటిక్ ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగానికి డీసీపీ నేతృత్వం వహించనున్నారు. దక్షిణ మండల టాస్క్‌ఫోర్స్ డీసీపీ గుమ్మి చక్రవర్తి ఆధ్వర్యంలో ఏసీపీ, ఇద్దరు సీఐలు, నలుగురు ఎస్సైలు, 20మంది కానిస్టేబుళ్లు పని చేయనున్నారు. హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఎక్కడ మాదక ద్రవ్యాలు, మత్తు పదార్థాలు విక్రయిస్తున్నట్లు సమాచారం వచ్చినా నార్కోటిక్ ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగం ఆధ్వర్యంలో దాడులు నిర్వహించి, సంబంధిత పోలీసులకు అప్పజెప్తారు. సంబంధిత పోలీస్‌స్టేషన్‌లో నిందితులపై ఎన్డీపీఎస్ చట్టం కింద కేసులు నమోదు చేస్తున్నారు.