AP DGP Sawang Meets CM Jagan : ఆంధ్రప్రదేశ్ ఉద్యోగుల చలో విజయవాడ పరిణామాల దృష్ట్యా.. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్తో డీజీపీ గౌతమ్ సవాంగ్ భేటీ అయ్యారు. సుమారు అరగంట పాటు జరిగిన భేటీలో... ఛలో విజయవాడ అంశంపైనే చర్చ జరిగినట్లు తెలిసింది. పోలీసు నిర్భందాలు, ఆంక్షలు పెట్టినా ఉద్యోగుల పోరాటం విజయవంతం కావడంపై డీజీపీని జగన్ ప్రశ్నించినట్లు తెలిసింది. ఉద్యోగులకు పోలీసులు సహకరించారన్న విషయంపై చర్చించినట్లు సమాచారం.
ఇంటెలిజెన్స్ వైఫల్యం
విజయవాడకు చాలా తక్కువ మంది వస్తారని పోలీసులు అంచనా వేసినా... అందుకు భిన్నమైన పరిస్థితి నెలకొంది. సుమారు 4 కిలోమీటర్ల మేర ఉన్న బీఆర్టీఎస్ రోడ్డు నిమిషాల వ్యవధిలోనే ఉద్యోగులతో నిండిపోయింది. ఈ పరిణామాలన్నీ ఎలా జరిగాయనే అంశంపైనా డీజీపీని సీఎం వివరణ అడిగినట్లు తెలిసింది. ఉద్యోగుల రాకను అంచనా వేయడంలో ఇంటెలిజెన్స్ వ్యవస్థ విఫలమైనట్లు ప్రభుత్వానికి ఫిర్యాదులు వచ్చాయి. అందువల్ల ఇంటెలిజన్స్, నిఘా వ్యవస్థ పనితీరుపైనా చర్చించినట్లు తెలిసింది.