ఆంధ్రప్రదేశ్లో దేవాలయాలపై దాడులు చేసిన వారిని వదిలేసి... ఘటనల గురించి చెప్పిన వారిపైనే కేసులు నమోదు చేస్తారా? అని తెదేపా అధినేత చంద్రబాబు మండిపడ్డారు. విధ్వంసాలు చేసిన వైకాపా నేతలపై కేసులు ఎందుకు లేవని నిలదీశారు. అన్యమత ప్రచారాలు, బలవంతపు మత మార్పిళ్లు చేస్తుంది ఏవరని ప్రశ్నించారు. సజ్జల కథనం, జగన్ రెడ్డి దర్శకత్వంలో డీజీపీ నటిస్తున్నారని చంద్రబాబు ఆక్షేపించారు. తిరుపతి పార్లమెంట్ నేతలతో ఆయన శనివారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఆలయాలపై 150 దాడులు, విగ్రహాల ధ్వంసాలు జరిగేదాకా పోలీసులు ఉదాసీనంగా వ్యవహరించారు. ఆ ఘటనలకు రాజకీయాలకు సంబంధం లేదని... ఉన్మాదుల పనేనని భోగి రోజున డీజీపీ చెప్పారు. మళ్లీ కనుమ రోజున మాట మార్చి ప్రతిపక్షాలకు అంటగడుతున్నారు. వైకాపా దుర్మార్గాలపై ప్రజా తీర్పునకు తిరుపతి ఉప ఎన్నిక తొలి పరీక్ష కావాలి. వైకాపా అరాచకాలకు అడ్డుకట్ట వేసేందుకు ప్రజలకు ఇదొక అవకాశం. అధికార పార్టీని ఓడించడం ద్వారా చరిత్రాత్మకమైన తీర్పునకు తిరుపతి వేదిక కావాలి. దేశానికే ఒక సందేశాన్ని తిరుపతి వాసులు పంపాలి.