Maha Shivaratri Story: సాక్షాత్తూ ఆ పరమేశ్వరుడే శివరాత్రి వ్రత ప్రభావాన్ని పార్వతీదేవికి ఈ కథ ద్వారా చెప్పాడు. పూర్వం ఓ పర్వత ప్రాంతంలో ఒక బోయవాడు ఉండేవాడు. ఉదయాన్నే వేటకు వెళ్లడం.. సాయంకాలానికి ఏదోఒక మృగాన్ని చంపి దానితో తన కుటుంబాన్ని పోషించటం ఆయన దినచర్య. అయితే ఓ రోజు ఉదయమే వెళ్లిన ఆ బోయకు చీకటిపడే వేళైనా ఒక్క జంతువూ దొరకలేదు. దాంతో ఆయన నిరాశగా ఇంటిముఖం పట్టాడు. అలా వస్తుండగా అతడికి దారిలో ఒక సరస్సు కనిపించింది. రాత్రిపూట ఏదైనా జంతువు అక్కడికి నీళ్లు తాగడానికి వచ్చి తీరుతుందని.. అప్పుడు దాన్ని తాను సంహరించవచ్చని అనుకొని ఆ సరస్సు పక్కనే ఉన్న ఒక చెట్టెక్కి కూర్చున్నాడు. తనకంటి చూపునకు అడ్డంగా ఉండటంతో ఒక కొమ్మ ఆకులను తుంచి కిందపడవేశాడు. ఆ బోయవాడు ఊతపదంగా శివ శివ అంటుండేవాడు. అలా అనడం మంచో చెడో అతడికి తెలియదు. కానీ.. ఆ సమయంలో అలా అంటూనే కాలం గడిపాడు. అలా గడిపిన రాత్రి శివరాత్రి పర్వదినమని కూడా తెలియదు ఆ బోయకు.
నాలుగు జూములైనా జింకలు రాలేదు
రాత్రివేళ మొదటి జాము గడిచాక ఒక ఆడజింక నీళ్లు తాగేందుకు అటుగా వచ్చింది. దాని మీదకు బాణాన్ని ఎక్కుపెట్టాడు బోయ. అయితే ఆ జింక తాను గర్భం దాల్చానని.. తనను చంపటం అధర్మమంటూ వదిలిపెట్టమని ప్రాధేయపడింది. మామూలుగా అయితే అతడి మనసు క్రూరంగా ఉండేదే. కానీ ఆ జింకను చూడటం.. పైగా అది మానవభాష మాట్లాడేసరికి బోయవాడు దాన్నేమీ చేయలేకపోయాడు. అలా రెండోజాము కూడా గడిచింది. అప్పుడు ఇంకొక ఆడ జింక అటుగా వచ్చింది. దాన్ని సంహరించాలనుకునే లోపల అది కూడా మానవ భాషలో తాను తన భర్తను వెతుకుతూ విరహంతో కృశించి ఉన్నానని.. పైగా బక్కచిక్కిన తన శరీరమాంసంతో అతడి కుటుంబానికి ఆకలి తీరదంటూ విడిచిపెట్టమని కోరింది. ఒకవేళ మరికాసేపటి దాకా ఏ జంతువూ దొరకకపోతే తానే తిరిగి వస్తానని అప్పుడు సంహరించమని వేడుకొంది. మొదట కనపడిన ఆడజింక కూడా అలాగే పలికిన సంగతిని గుర్తుకు తెచ్చుకుని బోయ ఆశ్చర్యపోయాడు. మూడోజాము గడిచేసరికి ఒక మగ జింక అతడికి కనిపించింది. దాన్ని బాణంతో కొడదామని అనుకునేంతలోనే ఆ మగ జింక కూడా మానవ భాషలో మాట్లాడింది. రెండు ఆడజింకలు ఇటుగా వచ్చాయా అని బోయనడిగింది. బోయవాడు వచ్చాయని, తనకు ఏ జంతువూ దొరకకపోతే ఆహారంగా తామే వస్తామని కూడా తనకు చెప్పినట్లు బోయవాడు మగ జింకకు చెప్పాడు. అప్పుడా మగజింక అయితే ఆ రెండు జింకలను ఒకసారి చూసుకొని వస్తానని అప్పుడు తనను సంహరించమని పలికి వెళ్లింది. ఇంతలో నాలుగోజాము కూడా గడిచి సూర్యోదయ సమయం దగ్గర పడింది.
మాట నిలబెట్టుకునేందుకు పోటీ పడ్డాయి