Tirumala Problems: తిరుమలలో నడకదారి భక్తులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. శ్రీవారి మెట్టు మార్గంవైపు వచ్చిన భక్తుల లగేజీ బ్యాగులు తిరుమలకు రాకపోవడంతో వారు ఆందోళనకు గురయ్యారు. శ్రీవారి మెట్టుమార్గంలో ఉదయం 8 గంటలకు బయలుదేరిన భక్తులు.. తమ లగేజీ బ్యాగులను తితిదే లగేజీ కౌంటర్‌లో డిపాజిట్ చేసి రశీదు పొందారు. అనంతరం ఉదయం 10 గంటలకు తిరుమలకు చేరుకోగా ఎంబీసీ సమీపంలోని లగేజీ కౌంటర్‌లో భక్తుల లగేజీ బ్యాగుల కోసం వేచి ఉన్నారు. అయితే కొంతమంది భక్తులకు సంబంధించి మూడు బ్యాగులు ఉంటే అందులో రెండు బ్యాగులు మాత్రమే పైకి వచ్చాయి. మరో బ్యాగు కోసం కొందరు వేచి ఉండగా.. మరికొందరి బ్యాగులు అసలే రాలేదు. దీంతో ఉదయం నుంచి సాయంత్రం వరకు పెద్దయెత్తున వేచి ఉన్న భక్తులు లగేజీ కౌంటర్ సిబ్బందితో వాగ్వాదానికి దిగి ఆందోళన చేపట్టారు.
తిరుమలలో నడకదారి భక్తుల ఇక్కట్లు.. బ్యాగులు రాక ఆందోళన - devotees problems in tirumala
19:50 June 02
తిరుమలలో నడకదారి భక్తుల ఇక్కట్లు.. బ్యాగులు రాక ఆందోళన
సమాచారం అందుకున్న తితిదే నిఘా, భద్రతా విభాగం అధికారులు, తిరుమల టుటౌన్ సీఐ చంద్రశేఖర్, ఎస్‌ఐ రమేష్‌బాబు తమ సిబ్బందితో ఎంబీసీ లగేజీ కౌంటర్ వద్దకు చేరుకుని భక్తులకు సర్దిచెప్పారు. సాయంత్రం 6గంటల కల్లా భక్తుల లగేజీ ఇప్పిస్తామని హామీఇచ్చారు. లగేజీ బ్యాగులు రాక దర్శనానికి వెళ్లలేని భక్తుల వివరాలను తితిదే నిఘా, భద్రతా సిబ్బంది నమోదుచేసుకుని వారికి ప్రత్యేక స్లిప్‌లను జారీచేశారు. స్లిప్‌లు చూపిస్తే దర్శనానికి పంపిస్తామని సూచించారు. భక్తుల బ్యాగులను తరలించే సమయంలో కొన్నింటిని పక్కన పెట్టడంతో సమస్య నెలకొందని, అలాగే బ్యాగులను పైకి తీసుకువచ్చే సమయం 3 గంటలకు పైగా పడుతుండగా, భక్తులు శ్రీవారి మెట్టు మార్గంలో రెండు గంటల్లోనే వస్తుండడంతో వేచి ఉండాల్సిన పరిస్థితి ఉందని తెలిపారు. ప్రస్తుతం దాదాపు 350 బ్యాగులు శ్రీవారి మెట్టుమార్గంలో నిలిచిపోయాయని వాటిని తిరుమలకు లారీలో తీసుకువస్తున్నామని తితిదే నిఘా, భద్రతా విభాగం అధికారులు తెలిపారు.
‘‘శ్రీవారి దర్శనం కోసం ఉదయం 8గంటలకు శ్రీవారి మెట్టు మార్గంలోని తితిదే లగేజీ కౌంటర్‌లో 3 బ్యాగులు ఇచ్చాం. ప్రస్తుతానికి 2 బ్యాగులు మాత్రమే వచ్చాయి. మరో బ్యాగురాలేదు. అందులోనే దర్శన టికెట్లు, రైలు టికెట్లు, స్వామివారి ముడుపులు ఉన్నాయి. ఉదయం నుంచి ఎన్నిసార్లు లగేజీ కౌంటర్ సిబ్బంది అడిగినా రాలేదని చెబుతున్నారు. ఉదయం 10.30 నుంచి సాయంత్రం వరకు ఇక్కడే వేచి ఉన్నారు. ఇప్పుడేమో కొద్దిసేపట్లో వస్తాయని అధికారులు చెబుతున్నారు. లగేజీ రాకపోవడంతో తీవ్రంగా ఇబ్బంది పడుతున్నాం. -వెంకటేశ్, బాపట్లకు చెందిన భక్తుడు
ఇవీ చూడండి: