తెలంగాణ

telangana

ETV Bharat / city

దేవరగట్టులో నెత్తురోడింది!

ఏపీలోని కర్నూలు జిల్లా దేవరగట్టు కర్రల సమరంలో రక్తం చిందింది. పదుల సంఖ్యలో భక్తులు గాయపడ్డారు. గతేడాదితో పోలిస్తే ఈ సంవత్సరం బన్ని ఉత్సవానికి భక్తుల సంఖ్య భారీగా పెరిగింది. పోలీసులు పటిష్ఠ చర్యలు చేపట్టినా...అవి ఆచారం ముందు నిలబడలేకపోయాయి.

దేవరగట్టులో నెత్తురోడింది!

By

Published : Oct 9, 2019, 6:38 AM IST

Updated : Oct 9, 2019, 6:47 AM IST

దేవరగట్టులో నెత్తురోడింది!

ఏపీలోని కర్నూలు జిల్లా దేవరగట్టులో ఏటా విజయదశమి రోజు కర్రల సమరం జరగడం అనవాయితీ. హోళగుంద మండలం దేవరగట్టు సమీపంలో ఉన్న కొండపై వెలిసిన మాళమల్లేశ్వరస్వామికి రాత్రి 12 గంటలకు కల్యాణం జరిపించారు. అనంతరం కొండ పరిసర ప్రాంతాల్లో ఉన్న పాదాలగట్టు, రక్షపడ, శమీవృక్షం, ఎదురుబసవన్నగుడి ప్రాంతాల్లో దివిటీల వెలుతురులో ఉత్సవ విగ్రహాలను ఊరేగించారు. ఈ ఉత్సవ విగ్రహాలను దక్కించుకోవటం కోసం... మూడు గ్రామాల ప్రజలు ఓ వర్గంగా, ఐదు గ్రామాల ప్రజలు మరో వర్గంగా ఏర్పడి ఉత్సవ విగ్రహాల కోసం కర్రలతో తలపడ్డారు. బన్ని ఉత్సవంగా పిలిచే ఈ సమరాన్ని అడ్డుకోడానికి పోలీసులు పటిష్ఠ ఏర్పాట్లు చేశారు. గాయపడిన వారి కోసం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు 30 పడకల తాత్కాలిక ఆరోగ్య కేంద్రాన్ని సిద్ధం చేశారు.

ఇలవేల్పు కోసం...

మాళమ్మ, మల్లేశ్వరస్వామివార్లు... రాక్షస సంహారం చేసిన తర్వాత... బన్ని ఉత్సవం నిర్వహిస్తారు. తమ ఇలవేల్పు దైవాన్ని స్వాధీనం చేసుకోవటం కోసం.. నెరణికి, నెరణికి తాండా, కొత్తపేట గ్రామాల ప్రజలు ఓ జట్టుగా... ఆలూరు, సుళువాయి, ఎల్లార్తి, అరికెర, నిడ్రవట్టి, బిలేహాల్‌ గ్రామాల ప్రజలు మరో జట్టుగా ఏర్పడి కర్రలతో తలపడ్డారు. ఇందులో ఇరువర్గాలవారు తీవ్రంగా గాయపడ్డారు. ఆచారాన్ని ఈ ఏడాది కొనసాగించారు. ఉత్సవాలను తిలకించేందుకు కర్ణాటక, తెలుగు రాష్ట్రాలకు చెందిన లక్షలాది మంది భక్తులు తరలివచ్చారు. కలెక్టర్ వీరపాండియన్, ఎస్పీ ఫక్కీరప్పలు ప్రత్యక్షంగా పరిస్థితిని సమీక్షించారు.

భారీగా బందోబస్తు...కానీ

బన్ని ఉత్సవంలో హింస జరగకుండా ఉండేందుకు పోలీసులు చేపట్టిన చర్యలు ఏ మాత్రం ఫలించలేదు. సీసీ కెమెరాలు, డ్రోన్ కెమెరాలు, ఫాల్కాన్‌ వాహనంతో నిఘా ఏర్పాటు చేశారు. 1000 మందికి పైగా పోలీసులతో బందోబస్తు చేపట్టారు. నెల రోజుల ముందు నుంచే అవగాహన కార్యక్రమాలు, ఫ్లెక్సీలు, లఘు చిత్రాలతో ప్రచారం నిర్వహించారు. మద్యాన్ని అరికట్టడం కోసం ఆబ్కారీ అధికారులు ఎన్నో ప్రయత్నాలు చేసినా నాటు సారా ఏరులై పారింది. ఉత్సవంలో పాల్గొన్న వారు మద్యం సేవించి రావటం వలన ఎక్కువ మందికి గాయాలయ్యాయి. ఎన్ని చర్యలు చేపట్టినా గ్రామస్థులు.. వారి సంప్రదాయాన్ని కొనసాగించారు. కర్రల సమరంలో ఈ ఏడాది 50 మందికి పైగా గాయపడ్డారు. నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. తీవ్రంగా గాయపడ్డవారిని ఆదోని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మొత్తానికి దేవరగట్టు కర్రల సమరంలో ప్రాణ నష్టం లేకపోవడం వల్ల పోలీసులు, అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.

ఇదీ చదవండి :

దసరాకు కర్రల సమరం... 11 గ్రామాల ప్రజల రణరంగం

Last Updated : Oct 9, 2019, 6:47 AM IST

ABOUT THE AUTHOR

...view details