తెలంగాణ

telangana

ETV Bharat / city

మరమ్మతులకు నోచుకోని కాలువలు, డిస్ట్రిబ్యూటరీలు.. రైతుల ఎదురుచూపు

Destroyed canals: రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టుల పరిధిలో ప్రధానమైన కాలువ పరిధిలో కాలువలు, డిస్ట్రిబ్యూటరీలు చాలాచోట ధ్వంసమయ్యాయి. మరమ్మతులు చేపడతామని ఏటా నీటిపారుదలశాఖ సిబ్బంది చెబుతున్న మాటలు నీటి మూటలుగా మిగిలిపోతున్నాయి. వానాకాలం ప్రారంభం నేపథ్యంలో ప్రాజెక్టుల కింద ధ్వంసమైన, కొట్టుకుపోయిన కాల్వలను ఎప్పుడు మరమ్మతు చేస్తారా అని సాగుకు సిద్ధమవుతున్న రైతులు ఎదురుచూస్తున్నారు.

canals not repaired under projects in telangana
canals not repaired under projects in telangana

By

Published : Jun 13, 2022, 4:05 AM IST

వానాకాలం ప్రారంభమౌతోంది. ప్రాజెక్టుల కింద ధ్వంసమైన, కొట్టుకుపోయిన కాల్వలను ఎప్పుడు మరమ్మతు చేస్తారా అని సాగుకు సిద్ధమవుతున్న రైతులు ఎదురుచూస్తున్నారు. రాష్ట్రంలో శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టు కింద భారీగా ఆయకట్టు ఉంది. ఈ ప్రాజెక్టు నుంచి 284 కిలోమీటర్ల కాకతీయ కాలువ ద్వారా 3.69 లక్షల హెక్టార్ల ఆయకట్టుకు సాగునీరందుతుంది. ఇంత ప్రధానమైన కాలువ పరిధిలో కాలువలు, డిస్ట్రిబ్యూటరీలు చాలాచోట ధ్వంసమయ్యాయి. మరోవైపు ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలోని జూరాల, నెట్టెంపాడు, కల్వకుర్తి, ఆర్డీఎస్‌, కోయిల్‌సాగర్‌ ప్రాజెక్టుల కింద కూడా డిస్ట్రిబ్యూటరీలు శిథిలమయ్యాయి. మరమ్మతులు చేపడతామని ఏటా నీటిపారుదలశాఖ సిబ్బంది చెబుతున్న మాటలు నీటి మూటలుగా మిగిలిపోతున్నాయి. జూన్‌ 1 నుంచి కొత్త నీటి సంవత్సరం ప్రారంభమైనా ఎక్కడా పనులు చేపట్టలేదు. అన్ని ప్రాజెక్టుల కింద కాల్వల పూర్తిస్థాయి మరమ్మతుకు దాదాపు రూ.600 కోట్ల వరకు ఖర్చవుతుందన్న అంచనాలున్నాయి. అత్యవసర పనులను వెంటనే చేపట్టేందుకు నీటిపారుదల శాఖలో రెండేళ్ల క్రితం ఓ అండ్‌ ఎం (ఆపరేషన్‌, మెయింటెనెన్స్‌) విభాగాన్ని ప్రారంభించిన ప్రభుత్వం ప్రత్యేకంగా నిధులను కేటాయిస్తున్నట్లు ప్రకటించింది. డీఈఈల నుంచి ఈఎన్‌సీల వరకు ప్రత్యేకంగా నిధులూ కేటాయించారు. బిల్లుల మంజూరులో జాప్యంతో పనులు పడకేశాయి.

  • జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలం పంగిడిపల్లి శివారులో నామరూపాలు లేకుండా ఉన్న ఈ కాలువ ఎస్సారెస్పీ పరిధిలోని 38 డిస్ట్రిబ్యూటరీ బ్రాంచ్‌ కెనాల్‌. దాదాపు 70 వేల ఎకరాలకు దీని ద్వారా నీరందుతుంది. లైనింగ్‌ మొత్తం కొట్టుకుపోయింది. కొన్నిచోట్ల భారీ పగుళ్లు ఏర్పడ్డాయి.
  • ఇది హనుమకొండ శివారుల్లో ఉన్న శ్రీరాం సాగర్‌ కాకతీయ కాలువ. కరీంనగర్‌, ఉమ్మడి వరంగల్‌, నల్గొండ జిల్లాలకు సాగునీరు అందిస్తుంది. చాలాచోట్ల కాలువ లైనింగ్‌ దెబ్బతింది. ఇలాగే వదిలేస్తే వరద ఉద్ధృతికి కోతకు గురయ్యే అవకాశం ఉంది. ఎస్సారెస్పీ పునరుజ్జీవన పథకంలో మరమ్మతులకు నిధులు కేటాయించినా ఫలితం కనిపించడం లేదు. ఎక్కడి కక్కడ కాలువ శిథిల స్థితి కళ్లకు కడుతోంది.
  • మెదక్‌ జిల్లాలోని ఘన్‌పూర్‌ ప్రాజెక్టు కింద ఉన్న ఈ కాలువ ద్వారా మెదక్‌, కొల్చారం, హవేలీ ఘన్‌పూర్‌ మండలాల్లో ఆయకట్టుకు నీరందుతుంది. 2016లో 42 కిలోమీటర్ల లైనింగ్‌ పనులు ప్రారంభించారు. ఇప్పటి వరకు 32వ కిలోమీటర్‌ వరకు మాత్రమే పూర్తి చేశారు. దీంతో చివరి ఆయకట్టుకు నీరందని పరిస్థితి నెలకొంది. ఫతేనహర్‌ కాలువపై పాపన్నపేట మండలంలోని ఆయకట్టు ఆధారపడి ఉంది. 27 కిలోమీటర్ల మేర బ్రాంచ్‌ కాల్వల పనులు చేపట్టాల్సి ఉంది.
  • జోగులాంబ గద్వాల జిల్లా ధరూరు మండలంలోని నెట్టెంపాడు ప్రాజెక్టు కింద ఉన్న 104వ నంబరు కాలువ ఇది. లైనింగ్‌, పొదల తొలగింపు లేకపోవడంతో నీటి ప్రవాహానికి ఆటంకాలు ఏర్పడుతున్నాయి.
  • జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్‌ మండలంలోని రాజోలిబండ మళ్లింపు పథకం (ఆర్డీఎస్‌) కింద ఉన్న 40వ నంబరు డి…స్ట్రిబ్యూటరీ కాలువ ఇది. లైనింగ్‌ దెబ్బతినగా, తూములు పూర్తిగా శిథిలమయ్యాయి. ఆర్డీఎస్‌ నీళ్లు అందడం లేదని తుమ్మిళ్ల ఎత్తిపోతలు ఏర్పాటు చేసినా చివరి వరకూ నీరందడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details