వరద బాధితుల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయాన్ని ఉపసభాపతి తీగుళ్ల పద్మారావు గౌడ్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు.. జోనల్ కమిషనర్ శ్రీనివాసరెడ్డి, డిప్యూటి కమిషనర్ మోహన్ రెడ్డి, కార్పోరేటర్ అలకుంట సరస్వతి, తదితరులు పాల్గొన్నారు. గడిచిన 110 సంవత్సరాల కాలంలో ఎన్నడూ లేని విధంగా జంట నగరాల్లో కురిసిన భారీ వర్షాలకు ప్రజా జీవనం అతలాకుతలమైందని.. పద్మారావు గౌడ్ అన్నారు. ప్రజలను ఆదుకోవడం ప్రభుత్వ బాధ్యత అని.. ప్రజలెవరూ అధైర్య పడాల్సిన అవసరం లేదని ఆయన తెలిపారు.
వరద బాధితులకు ప్రభుత్వ సాయం అందించిన ఉప సభాపతి - వరద సాయం
రాష్ట్ర ప్రభుత్వం వరద బాధితులకు ఇస్తామని ప్రకటించిన కుటుంబానికి రూ.10 వేల చొప్పున ఆర్ధిక సాయం పంపిణీని సికింద్రాబాద్ నియోజకవర్గం పరిధిలో ఉప సభాపతి తీగుళ్ల పద్మారావు గౌడ్ మంగళవారం స్థానిక కార్పరేటర్లు, నాయకులు, అధికారులతో కలిసి ప్రారంభించారు. లాలాపేట్‌లోని చంద్రబాబు నగర్లో నగదు పంపిణీ చేశారు.
![వరద బాధితులకు ప్రభుత్వ సాయం అందించిన ఉప సభాపతి Deputy Speaker Starts Govt Help for flood victims](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9250029-511-9250029-1603212559895.jpg)
వరదల కారణంగా ఇబ్బంది పడిన ప్రతి కుటుంబానికి జీహెచ్ఎంసీ, రెవెన్యూ విభాగాల ద్వారా గుర్తించి.. సహకారం చేస్తామన్నారు. కుటుంబానికి రూ.10 వేల చొప్పున నగదును అందిస్తున్నట్టు తెలిపారు. పూర్తిగా కూలిన ఇళ్ళకు రూ.లక్ష మేరకు, పాక్షికంగా ధ్వంసమైన ఇళ్ళకు రూ.50 వేల మేరకు ఆర్ధిక సహకారాన్ని అందిస్తున్నామన్నారు. సికింద్రాబాద్ పరిధిలో వరదల కారణంగా ఇబ్బంది పడిన వారికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. సొంత డబ్బులతో బియ్యం, నిత్యావసరాలు పంచినట్టు వివరించారు. సికింద్రాబాద్ పరిధిలో భారీ వర్షాలు కురిసినప్పటికీ ఇబ్బందులు తలెత్తకుండా గడచిన ఐదేళ్ళ కాలంలో తీసుకున్న చర్యలు మంచి ఫలితాన్నిచ్చాయన్నారు. పలు కాలనీల్లోని నాలాలు, కల్వర్టులను విస్తరించినట్టు తెలిపారు.
ఇవీ చూడండి: ఏ క్షణంలోనైనా రంగంలోకి దిగేందుకు ఆర్మీ బలగాలు సిద్ధం