Gaddiannaram Fruit Market: హైదరాబాద్ గడ్డిఅన్నారం వ్యవసాయ మార్కెట్ యార్డులో షెడ్ల తొలగింపు ప్రక్రియ మొదలైంది. ఈరోజు తెల్లవారుజాము నుంచి పండ్ల మార్కెట్ ఆవరణలో పాత షెడ్లు, భవనాల తొలగింపు పనులు ప్రారంభమయ్యాయి. వ్యాపారుల సామగ్రి, ఇతర వస్తువులు, కమీషన్ ఏజెంట్ల ట్రక్కులను ఆటోల్లో తరలిస్తున్నారు. మార్కెట్ ఖాళీ చేసేది లేదంటూ వ్యాపారులు నిన్న ఆందోళనకు దిగారు. ఏ క్షణాన్నైనా మార్కెట్‌కు తాళాలు వేస్తారోమోనని ఆందోళన చేయడంతో.. పోలీసులు శాంతింపజేశారు.
హైకోర్టు ఆదేశాల మేరకు శుక్రవారం మార్కెట్ ప్రాంగణం ద్వారాల తాళాలు తెరిచిన మార్కెటింగ్ శాఖ... రెండు రోజుల గడువు పూర్తి కావడంతో రోడ్లు భవనాలు శాఖ ఆధ్వర్యంలో అధికారులు కూల్చివేతలకు ఉపక్రమించారు. గతంలో పండ్ల మార్కెట్ స్థలాన్ని రోడ్డు భవనాల శాఖకు మార్కెటింగ్ శాఖ అప్పగించింది. సువిశాల ఆ ప్రాంగణంలో త్వరలో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణానికి శంఖుస్థాపన చేసేందుకు సన్నాహాలు సాగుతున్నాయి.