తెలంగాణ రైతులు గంపగుత్తగా లావు రకం ధాన్యాన్ని సాగు చేస్తుండటంతో గిట్టుబాటు ధరలు లభించడం లేదు. ఈ పరిస్థితి నుంచి రైతాంగాన్ని గట్టెక్కించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నడుం బిగించింది. దేశీయంగా ఎక్కువ మంది వినియోగించే బియ్యం రకాలేమిటి? అంతర్జాతీయంగా గిరాకీ ఉన్న ధాన్యం రకాలేవి? వాటిని ఏయే దేశాలకు ఎగుమతి చేసేందుకు అవకాశం ఉంది? తదితర అంశాలను అధ్యయనం చేసేందుకు ఐఏఎస్ అధికారి ఆధ్వర్యంలో కమిటీని నియమించాలని నిర్ణయించింది.
విపణిలో గిరాకీ ఉన్న పంటలనే పండించేలా, సాగు విధానంలో సంస్కరణలకు తెలంగాణ ప్రభుత్వం శ్రీకారం చుట్టబోతోంది. ఈ వానాకాలం నుంచే ఈ ప్రక్రియను ప్రారంభించనుంది. లావు రకం ధాన్యంలో 1010, 1064, 2636, ఎంటీయూ 1061 రకాలను గుర్తించింది.
2636, 1064 రకం బియ్యానికి ఆఫ్రికా దేశాల్లో మంచి గిరాకీ ఉన్నట్లు గుర్తించారు. ఇలా ఏఏ కాలాల్లో ఎలాంటి వరి రకాలను రైతులు పండించాలి? ఎంత విస్తీర్ణంలో సాగుచేయాలి? వాటికి వివిధ దేశాల్లో ఉన్న గిరాకీ ఎంత? అనే విషయమై సమగ్ర కాల పట్టిక ఖరారు చేసే పనిని ప్రభుత్వం కమిటీకి అప్పగించనుంది. కమిటీలో జాయింట్ కలెక్టర్ స్థాయి అధికారులు నలుగురు ఉంటారు. వారి ఎంపిక పూర్తయినట్టు తెలిసింది. త్వరలో వారి పేర్లను అధికారికంగా ప్రకటించనున్నారు.