- కరీంనగర్ జిల్లా కమలాపూర్‌కు చెందిన ఓ ప్రజాప్రతినిధి హన్మకొండ రెడ్డికాలనీలో ఉంటున్నారు. కొవిడ్‌బారిన పడి ఇంట్లోనే ఐసోలేషన్‌లో ఉన్న ఆయన ఆరోగ్యం క్షీణించింది. శ్వాస తీసుకోవడం కష్టంగా ఉందంటూ గురువారం ఉదయం 108 కేంద్రానికి ఫోన్ రావడంతో 9.25 గంటలకు ఆంబులెన్స్ సిబ్బంది అతడి ఇంటికి చేరుకున్నారు. అతడికి ఆంబులెన్స్‌లోనే ఆక్సిజన్ అందించి మూడు గంటల్లో హైదరాబాద్ శామీర్‌పేట ఆర్‌వీఎం ఆసుపత్రికి తరలించారు. ... కరోనా ఉద్ధృతి నేపథ్యంలో 108 ఆంబులెన్స్ సర్వీస్‌ల సిబ్బంది పనితీరుకు ఇదో మచ్చుతునక.
-
సిద్దిపేట జిల్లా గజ్వేల్‌కు చెందిన ఓ వ్యక్తి కరోనా బారిన పడి పరిస్థితి విషమించడంతో సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రిలో చేర్పించారు. అక్కడ చికిత్స పొందుతూ మరణించడంతో అంత్యక్రియల నిమిత్తం అతడి మృతదేహాన్ని ఎర్రగడ్డ ఈఎస్‌ఐ శ్మశానవాటికకు తరలించాల్సి వచ్చింది. జీహెచ్‌ఎంసీ అధికారులు ఓ ఆంబులెన్స్ నిర్వాహకుడిని పిలిపించి ఆ బాధ్యతను అప్పగించారు. సదరు ఆంబులెన్స్ నిర్వాహకుడు నలుగురు బాయ్స్ సహకారంతో మృతదేహాన్ని శ్మశానవాటికకు తరలించాడు. ... గాంధీ ఆసుపత్రి వద్ద ప్రైవేటు ఆంబులెన్స్ నిర్వాహకుల సేవలకు ఇదో ఉదాహరణ.
తెలంగాణలోని 108 వాహనాలు జనవరి నెలలో రోజుకు సగటున 26 మంది కొవిడ్ రోగుల్ని తరలిస్తే.. ఏప్రిల్‌లో ఈ సగటు ఏకంగా 238. కరోనా ఉద్ధృతికి అద్దం పట్టే లెక్క ఇది. కొవిడ్ సోకిన రోగులను తరలించేందుకు ఏ వాహనాలూ ముందుకు రాని పరిస్థితుల్లో అంబులెన్స్‌లపై ఒత్తిడి పెరుగుతోంది.
కరోనా సెకండ్‌వేవ్‌లో రోగుల సంఖ్య విపరీతంగా పెరుగుతుండటంతో అందుబాటులో ఉన్న 108, ప్రైవేటు అంబులెన్స్‌లు సరిపోవడం లేదు. ఈ ఏడాది ఆరంభంతో పోల్చితే ప్రస్తుతం డిమాండ్ దాదాపు పది రెట్లకు పెరగడమే పరిస్థితి తీవ్రతను చాటుతోంది. తొలి మూడు నెలల్లో సాధారణంగానే ఉన్నా ఈనెలలో కరోనా అనూహ్యంగా విజృంభించడంతో అంబులెన్స్‌లకు తాకిడి పెరిగింది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న సుమారు 500 వరకు 108 వాహనాల్లో సింహభాగం కొవిడ్ రోగుల తరలింపులోనే నిమగ్నమయ్యాయి. సాధారణంగా 108 ఆంబులెన్స్‌లు తమ పరిధిలో మాత్రమే సేవలందిస్తాయి. కానీ కొవిడ్ నేపథ్యంలో రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా తరలించాలనే ఆదేశాలతో చాలా ఆంబులెన్స్‌లు జిల్లాల నుంచి హైదరాబాద్‌కు రోగుల్ని తీసుకెళ్తున్నాయి.