తెలంగాణ

telangana

By

Published : Jul 20, 2021, 5:34 PM IST

ETV Bharat / city

దేశ రాజధానిలో అలర్ట్ : దాడికి ఉగ్రమూకల పన్నాగం

స్వతంత్ర దినోత్సవం సమీపిస్తున్న వేళ దేశ రాజధాని దిల్లీలో భారీ దాడికి ఉగ్రమూకలు పథక రచన చేసినట్లు నిఘా వర్గాల సమాచారం. పేలుడు పదార్థాలతో కూడిన డ్రోన్లతో దిల్లీలో దాడిచేయాలని పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రమూకలు కుట్ర పన్నినట్లు తెలుస్తోంది. నిఘావర్గాల హెచ్చరికలతో దేశ రాజధానిలో భద్రతను కట్టుదిట్టం చేశారు.

డ్రోన్‌ దాడి
drone attack

దేశ రాజధాని దిల్లీలో స్వాతంత్ర్య దినోత్సవం ముందు ఉగ్రదాడి జరిగే ప్రమాదముందన్న నిఘా వర్గాల హెచ్చరికతో భద్రతా సంస్థలు అప్రమత్తమయ్యాయి. జమ్ముకశ్మీర్‌లో భారత వాయుసేనకు చెందిన వైమానిక స్థావరంపై ఇటీవల విద్రోహ డ్రోన్‌ దాడి జరిగింది. అదే తరహాలో పాకిస్థాన్‌ ప్రేరేపిత ఉగ్రమూకలు పేలుడు పదార్థాలతో కూడిన డ్రోన్లతో ఈసారి దిల్లీపై విరుచుకుపడే అవకాశం ఉన్నట్లు నిఘావర్గాల సమాచారం. ఈ మేరకు భద్రతా సంస్థలు నగరంలో భద్రతను కట్టుదిట్టం చేశాయి.

అశాంతిని సృష్టించడానికి..

భారత ప్రభుత్వం 2019 ఆగస్టు 5న జమ్ముకశ్మీర్‌కు ప్రత్యేకహోదా కల్పిస్తున్న అధికరణం 370ని రద్దు చేసింది. ఈ నేపథ్యంలో పార్లమెంటు వర్షాకాల సమావేశాలు, స్వాతంత్ర్య దినోత్సవ కార్యక్రమాలకు విఘాతం కలిగించేందుకు నగరంలోని పలు కీలక ప్రాంతాలను లక్ష్యంగా చేసుకొని పాక్‌ ఉగ్రమూకలు దాడులకు పాల్పడొచ్చని భద్రతా సంస్థలు అనుమానం వ్యక్తం చేస్తున్నాయి. రానున్న కొద్ది రోజుల్లో నగరంలో అశాంతిని సృష్టించడానికి ఉగ్రమూకలు పెద్ద కుట్రనే పన్నుతున్నాయని భద్రతా సంస్థలు పేర్కొన్నాయి. ఈ అంశంపై దిల్లీ పోలీసులను సైతం అప్రమత్తం చేశాయి.

తొలిసారి శిక్షణ..

ఇంటెలిజెన్స్‌ విభాగం సహా నగరంలోని పోలీస్‌ ఠాణాలను దిల్లీ పోలీస్‌ కమిషనర్‌ బాలాజీ శ్రీవాస్తవ అప్రమత్తం చేశారు. డ్రోన్‌ దాడులకు అవకాశమున్న ప్రాంతాలపై ప్రత్యేకంగా నిఘా పెట్టాలని ఆదేశించారు. ముందస్తు భద్రతా చర్యల్లో భాగంగా ప్రత్యేకంగా కంట్రోల్‌ రూమ్‌ను సైతం పోలీసులు ఏర్పాటు చేశారు. చారిత్రక ఎర్రకోట వద్ద నాలుగు యాంటీ డ్రోన్‌ వ్యవస్థలను ఏర్పాటు చేయనున్నారు. విద్రోహ డ్రోన్‌ దాడులను సమర్థంగా తిప్పికొట్టేందుకు పోలీసులు, భద్రతా దళాలకు తొలిసారిగా శిక్షణ ఇస్తున్నారు.

ఇదీ చూడండి:delta variant: బీ అలర్ట్‌.. గాలి ద్వారా డెల్టా వేరియంట్‌ వ్యాప్తి

ABOUT THE AUTHOR

...view details