నీట్ ఫలితాల(NEET EXAM RESULTS 2021) కోసం విద్యార్థులు ఎంతో ఆత్రుతతో ఎదురుచూస్తున్నారు. గత నెల 12న పరీక్ష నిర్వహించినా ఫలితాల వెల్లడిలో తీవ్ర జాప్యం జరుగుతోంది. కనీసం ప్రాథమిక జవాబు పత్రం(ప్రిలిమినరీ కీ) కూడా వెల్లడించలేదు. ప్రశ్నపత్రం లీక్ అయిందని ఆరోపణలు రావడంతోనే ఫలితాల వెల్లడి ఆలస్యమవుతోందనే అభిప్రాయం ఉంది. సాధారణంగా వైద్య విద్య ప్రవేశ పరీక్ష(నీట్)ను మే నెలలో నిర్వహించి.. జూన్‌లో ఫలితాలు వెల్లడిస్తారు. ఆగస్టు నుంచి తరగతులు ప్రారంభమవుతాయి. ఈ ఏడాది కొవిడ్ కారణంగా పరీక్ష ఆలస్యంగా జరిగింది. ఐదు నెలలు గడిచినా ఫలితాలపై నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్‌టీఏ) ప్రకటన చేయకపోవడంతో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
NEET EXAM RESULTS 2021: నీట్ ఫలితాల కోసం విద్యార్థుల ఎదురుచూపులు - నీట్ ఫలితాలెప్పుడో
నీట్ ఫలితాల(NEET EXAM RESULTS 2021) కోసం విద్యార్థులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. పరీక్ష జరిగి నెలరోజులు దాటినా.. ప్రిలిమినరీ కీ కూడా విడుదల కాలేదు. ప్రశ్నాపత్రం లీకవ్వడం వల్లే ఫలితాల వెల్లడిలో జాప్యం అవుతోందనే అభిప్రాయం ఉంది. మరోవైపు ఈ నెలఖారులోగా ఫలితాలు విడుదలయ్యే అవకాశముందని నిపుణులు అంటున్నారు.
మహారాష్ట్ర, రాజస్థాన్ తదితర ప్రాంతాల్లో నీట్ ప్రశ్నపత్రం బయటకు పొక్కిందన్న ఆరోపణలు రాగా కేంద్రం సీబీఐ విచారణకు ఆదేశించింది. సీబీఐ కొందరిని అరెస్టు చేసింది కూడా. ఆ విచారణలో ఏం తేలిందనే సమాచారం ఇప్పటి వరకూ బయటకు రాలేదు. ఇదే సమయంలో నీట్‌ను రద్దు చేసి మళ్లీ నిర్వహించాలని కొందరు విద్యార్థులు సుప్రీంకోర్టులో కేసు దాఖలు చేశారు. ఆ పిటిషన్‌ను న్యాయస్థానం కొట్టేసింది. ఇవన్నీ ఫలితాలు తాత్కాలికంగా ఆగడానికి కారణాలుగా ఉన్నట్లు నిపుణులు విశ్లేషిస్తున్నారు. కోర్టు తీర్పు వచ్చాకే ‘ప్రిలిమినరీ కీ’ని విడుదల చేయాలని ఎన్టీఏ భావించి ఉంటుందని కూడా పేర్కొంటున్నారు. ఇప్పుడిక ప్రాథమిక జవాబు పత్రం, ఫలితాల వెల్లడికి మార్గం సుగమమైందని విశ్లేషిస్తున్నారు.
వారంలోపు ‘ప్రిలిమినరీ కీ’!
నీట్ పరీక్షకు దరఖాస్తులు ఆహ్వానించినప్పుడు.. అప్పటికింకా చాలా రాష్ట్రాల్లో ఇంటర్ ఫలితాలు రాలేదు. దాంతో ఎక్కువ మంది విద్యార్థులు సమగ్ర సమాచారాన్ని పొందుపర్చలేదు. తర్వాత అన్ని రాష్ట్రాల్లో ఫలితాలు వచ్చేయడంతో.. పూర్తి వివరాలను పొందుపర్చడానికి నీట్ అధికారులు తాజాగా మరోమారు అవకాశం కల్పించారు. ఆ గడువు గురువారం(14వ తేదీ)తో ముగిసింది. దీంతో వారం రోజుల్లోపు ‘ప్రిలిమినరీ కీ’ని విడుదల చేసే అవకాశాలున్నట్లు నిపుణులు భావిస్తున్నారు. ఆ ‘కీ’పై అభ్యంతరాలుంటే స్వీకరణకు మరో వారం గడువు ఇస్తారు. అనంతరం ఈ నెలాఖరులోగా ఫలితాలు వెల్లడయ్యే అవకాశాలున్నాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇంకా ఆలస్యమైతే ఆ ప్రభావం విద్యా సంవత్సరంపై పడుతుంది. ఫలితాలు(NEET EXAM RESULTS 2021) వెల్లడైన తర్వాత ప్రవేశ ప్రక్రియ మొదలు పెట్టడానికి మరో నెల పడుతుంది. అయితే వైద్యవిద్యలో సీటు రాకపోతే.. ప్రత్యామ్నాయ విద్య వైపు దృష్టిపెట్టే వారికి కొంత ఇబ్బందులు ఎదురవుతున్నాయని నిపుణులు చెబుతున్నారు.