తెలంగాణ

telangana

ETV Bharat / city

నెరవేరని జల'ఆశయం'.. కాలువలు లేక రైతులకు అందని నీరు - వైెయస్​ఆర్​ కడప జిల్లా

జలశయాల్లో దండిగా నీళ్లు ఉన్నా సగం కూడా వాడుకోలేని పరిస్థితి. కాలువలు, డిస్ట్రిబ్యూటరీలు నిర్మించడంలో జాప్యమే ఇందుకు కారణం. ఈ దుస్థితి ఏపీలోని వైయస్​ఆర్​ జిల్లాలోని జలశయాల్లో నెలకొంది. చెరువులకు నీరు అందకపోవడం వల్ల ఇబ్బందిగా ఉంటోందని.. తాగునీరు దొరకడం కూడా సమస్యగా మారిందని రైతులు వాపోతున్నారు.

delay in canal construction for reservoirs in ysr kadapa district
delay in canal construction for reservoirs in ysr kadapa district

By

Published : Jul 8, 2022, 6:25 AM IST

ఖరీఫ్‌ ప్రారంభమైంది. ఏపీలోని వైయస్‌ఆర్‌ జిల్లాలో జలాశయాల్లో దండిగా నీళ్లూ ఉన్నాయి. అయితే వీటి కింద కాలువలు, డిస్ట్రిబ్యూటరీలు, పిల్లకాలువలు నిర్మించకపోవడంతో వేలాది ఎకరాల ఆయకట్టుకు నేరుగా నీరందించలేని దుస్థితి నెలకొంది. సూక్ష్మ నీటి సేద్యం కింద పనులు చేపట్టి నీళ్లందించేందుకు టెండర్లు పిలిచినా పురోగతి అంతంతమాత్రమే. ఫలితంగా ఈ జిల్లాలో ఇప్పటికీ బోర్లు, మోటార్లే సేద్యానికి దిక్కవుతున్నాయి. జిల్లాలోని గండికోట జలాశయంలో 22.980 టీఎంసీలు, చిత్రావతి బ్యాలెన్సింగు రిజర్వాయర్‌లో 7.732 టీఎంసీలు ఉన్నాయి. మైలవరం, వామికొండ, సర్వారాయసాగర్‌ జలాశయాల్లోని నీటిని కూడా కలిపితే ప్రస్తుతం అందుబాటులో ఉన్న నీరు సుమారు 36 టీఎంసీలు. ఖరీఫ్‌ ప్రణాళిక రూపొందించిన మే చివరినాటికి ఈ జలాశయాల్లో 40 టీఎంసీల నీళ్లున్నాయి. అయితే ఖరీఫ్‌లో పంటలకు, పరిశ్రమలు, తాగునీటి అవసరాలకు కలిపి 17 టీఎంసీలు మాత్రమే వినియోగించుకోగలరని జలవనరుల శాఖ అధికారిక గణాంకాలే పేర్కొంటున్నాయి. వీటి కింద 1,94,716 ఎకరాల ఆయకట్టు ఉండగా 1,19,000 ఎకరాలకు మాత్రమే నీరందించగలమని అధికారులు పేర్కొంటున్నారు. ఇందులోనూ చెరువులు నింపడంతో భూగర్భజలాలు పెరిగి, బోర్ల కింద సాగవుతున్న పరోక్ష ఆయకట్టే ఎక్కువని వారు అంగీకరిస్తున్నారు. నిరుడు గండికోటలో పూర్తిస్థాయి నీరున్నా కాలువలు లేక రెండు టీఎంసీలే వాడుకోగలిగారు. ఈసారీ అదే పరిస్థితి కనిపిస్తోంది.

నీళ్లున్నా.. వినియోగించే దారేది?
చిత్రావతి జలాశయం కింద ఉన్న 12 వేల ఎకరాల ఆయకట్టుతోపాటు లింగాల ప్రధాన కాలువ, పులివెందుల బ్రాంచి కాలువ, పైడిపాలెం ద్వారా 1,26,300 ఎకరాలకు నీళ్లు అందించాలనేది ప్రభుత్వ ప్రణాళిక. చిత్రావతి జలాశయం, ఎత్తిపోతల పథకాలను 2017-18లో పూర్తి చేశారు. ఎత్తిపోతలు ప్రారంభించారు. 2018లో 6, 2019లో 7, 2020లో పది టీఎంసీలు నింపారు.

లింగాల కింద ఇదీ పరిస్థితి
చిత్రావతి జలాశయం నుంచి లింగాల కుడి కాలువకు నీరివ్వాలి. ఈ కాలువను రూ.328 కోట్ల ఖర్చుతో 53 కిలోమీటర్ల మేర తవ్వారు. మధ్యలో అనేకచోట్ల పనులు పెండింగులో ఉన్నాయి. లింగాల కుడి కాలువ నుంచి గ్రావిటీ ద్వారా సుమారు 30వేల ఎకరాలకు, సూక్ష్మసేద్యం కింద 29వేల ఎకరాలకు నీళ్లివ్వాలి. లింగాల కుడికాలువపై 23 చోట్ల ఎత్తిపోతల పథకాలు నిర్మించి.. చెరువులకు, చెక్‌ డ్యాంలకు నీళ్లు మళ్లించాలనేది ఆలోచన. అయితే ఎత్తిపోతల సంఖ్యను 23 నుంచి 17కు తగ్గించారు. ఇందులోనూ ఒకటి ఇంకా పూర్తి కాలేదు. జలాశయంలో నీళ్లున్నా సంపులు, ఎత్తిపోతల పనుల్లో సమస్యలతో కొన్నిచోట్ల చెరువులకు నీళ్లివ్వలేకపోతున్నారు. లింగాల కుడికాలువ ఆయకట్టుకు ప్రత్యక్షంగా నీరిచ్చే వ్యవస్థను ఇప్పటికీ ఏర్పాటు చేయలేదు. దీని కింద సుమారు 26 వేల ఎకరాలకు నీరందుతోందని రికార్డుల్లో నమోదైంది. కాలువ వెంట చెరువులకు నీళ్లివ్వడంతో పెరిగిన భూగర్భజలాలను మోటార్లతో తోడుకుని తోటలు పెంచుతున్నారు. అదంతా పరోక్ష ఆయకట్టేనని అధికారులు స్పష్టంగా చెబుతున్నారు.

సూక్ష్మసేద్యమూ అంతంతే..
చిత్రావతి నుంచి కాలువలు, డిస్ట్రిబ్యూటరీలు, సంపుల ద్వారా సూక్ష్మసేద్యం కోసం నీటిని మళ్లించాలని నిర్ణయించారు. ఈ మేరకు లింగాల కాలువ కింద 39,400 ఎకరాలకు రూ.419 కోట్లతో, పైడిపాలెం కింద 37,500 ఎకరాలకు రూ.367 కోట్లతో, పులివెందుల బ్రాంచి కాలువ కింద 45,500 ఎకరాలకు రూ.470 కోట్లతో పనులు చేపట్టేందుకు టెండర్లు పిలిచి గుత్తేదారుకు అప్పజెప్పారు. పులివెందుల బ్రాంచి కాలువ కింద మాత్రమే పనులు చేస్తున్నారు. ఇంకా 250 కిలోమీటర్ల మేర వివిధ కాలువలను నిర్మించాల్సి ఉంది. పూడిపోయిన కాలువలకు మరమ్మతు చేయాల్సి ఉంది. కేవలం 40 కిలోమీటర్ల మేర మాత్రమే కొంతపని జరిగినట్లు తెలిసింది. లింగాల, పైడిపాలెం కింద సూక్ష్మసేద్యం పనులు ఇంకా మొదలవలేదు.

  • గాలేరు- నగరి సుజల స్రవంతి వరద కాలువ ద్వారా గండికోట జలాశయానికి నీటిని తీసుకొచ్చి, అక్కడి నుంచి ఆయకట్టుకు మళ్లించాలనేది ప్రణాళిక. ప్రస్తుతం గండికోటలో 23 టీఎంసీల నీరుంది. గాలేరు- నగరి తొలిదశలో గండికోట నుంచి సర్వారాయసాగర్‌, వామికొండ సాగర్‌ జలాశయాలకు నీళ్లు మళ్లించి 35 వేల ఎకరాలకు ఇవ్వాలి. ప్రస్తుతం కాలువల ద్వారా, భూగర్భజలాలతో పరోక్షంగా కలిపి 6,500 ఎకరాలే సాగవుతోంది.
  • గండికోట నుంచి చిత్రావతి బ్యాలెన్సింగ్‌ జలాశయానికి అయిదు దశల్లో 8.3 టీఎంసీలు ఎత్తిపోయడానికి రూ.2,059 కోట్లతో పనులు చేపట్టారు. ఈ ఎత్తిపోతల నుంచి 12 వేల ఎకరాలకు నీళ్లందించాలనేది ప్రణాళిక. ఉప కాలువలను పూర్తిస్థాయిలో నిర్మించకపోవడంతో లక్ష్యం నెరవేరడం లేదు.

"ఎత్తిపోతల పథకం సిద్ధం చేసినా అక్కడి నుంచి మా చెరువుకు వచ్చే కాలువలకు నీళ్లు వదలకపోవడంతో ఇబ్బందిగా ఉంది. మా చెరువులకు నీళ్లు వదిలితే భూగర్భజలాలు ఇంకా పెరుగుతాయి."

- మధుసూదన్‌రెడ్డి, లోపట్నూతల, లింగాల మండలం

గొంతు తడవడమూ కష్టమే

"సంపుల్లో నీళ్లున్నాయి. అక్కడి నుంచి మా చెరువుకు నీళ్లు రావడం లేదు. బోర్లు వేసినా నీళ్లు పడటం లేదు. తాగడానికీ సమస్యగా ఉంది. ఎత్తిపోతల పథకం ఏర్పాటు చేసి నీళ్లొచ్చేలా చూడాలి."

- రాజపుల్లారెడ్డి, మిట్టాపురం ప్రాంతం

ఇదీ చూడండి :

ABOUT THE AUTHOR

...view details