తెలంగాణ

telangana

ETV Bharat / city

GHMC: బల్దియాలో పట్టాలెక్కని పలు అభివృద్ధి పనులు - జీహెచ్​ఎంసీ వార్తలు

జీహెచ్‌ఎంసీలో చాలా సమస్యలు అపరిష్కృతంగా ఉన్నాయి. వీటిని పరిష్కరించాలని ప్రణాళిక రూపొందించింది జీహెచ్​ఎంసీ. భూగర్భ కేబుల్‌ వ్యవస్థను ఏర్పాటు చేయాలని, డిజిటల్‌ చిరునామా వ్యవస్థ తీసుకురావాలని, డ్రోన్లతో భవనాలను మ్యాపింగ్‌ చేయాలని, వైట్‌ ట్యాపింగ్‌ రోడ్లు నిర్మించాలని గతంలో నిర్ణయించింది. కానీ ఈ ప్రతిపాదనలేవీ కార్యరూపం దాల్చలేదు.

ghmc
జీహెచ్‌ఎంసీ

By

Published : Aug 3, 2021, 9:37 AM IST

రాజధానిని పట్టిపీడిస్తున్న కీలకమైన సమస్యలను పరిష్కరించాలని జీహెచ్‌ఎంసీ ఏళ్ల కిందట ప్రణాళిక రూపొందించింది. భూగర్భ కేబుల్‌ వ్యవస్థను ఏర్పాటు చేయాలని, డిజిటల్‌ చిరునామా వ్యవస్థ తీసుకురావాలని, డ్రోన్లతో భవనాలను మ్యాపింగ్‌ చేయాలని, వైట్‌ ట్యాపింగ్‌ రోడ్లు నిర్మించాలని నిర్ణయించింది. పదేళ్ల కిందట రూపుదిద్దుకున్న ఈ ప్రతిపాదనలేవీ కార్యరూపం దాల్చలేదు. బల్దియాకు ఏటా వచ్చే రూ.5,500 కోట్ల ఆదాయంలో జీతాలు, నిర్వహణ ఖర్చులు పోను రూ.1500 కోట్లతో ఈ అభివృద్ధి పనులు చేపట్టడానికి వీలుంది. పలు కారణాలతో చేపట్టకపోవడం వల్ల చిన్నాచితకా అదనపు ఇబ్బందులు తలెత్తుతున్నాయి. వెరసి ప్రణాళిక రూపొందించడం.. మర్చిపోవడం నిత్యకృత్యంగా మారింది.

మృత్యుపాశాల్లా తీగలు

నగరంలో ఏ వీధికి వెళ్లినా విద్యుత్తు స్తంభాలకు కేబుళ్లు, ఇంటర్‌నెట్‌ ఇతరత్రా తీగలు వేళాడుతుంటాయి. తీగల్లో కొంత భాగం తెగి రోడ్ల మీద పడటంతో ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. కేబుళ్ల ఏర్పాటుకు కొన్ని ప్రైవేటు సంస్థలు రోడ్లను ఇష్టానుసారం తవ్వుతున్నాయి. ఈ సమస్యలను అధిగమించేందుకు భూగర్భంలో డక్ట్‌ను ఏర్పాటు చేయాలని బల్దియా కమిషనర్‌గా ఎంటీ కృష్ణబాబు ఉన్నప్పుడు ప్రణాళిక రూపొందించారు. ఆ తర్వాత ఈ ప్రతిపాదన మూలనపడింది. ఏటా రూ.200 కోట్ల వరకు నగరంలో రోడ్లపై గుంతలు పూడ్చడానికి, రోడ్ల నిర్మాణానికి వెచ్చిస్తున్నారు. భూగర్భ కేబుల్‌ వ్యవస్థ సాకారమైతే ఈ నిధుల్లో చాలావరకు మిగిలించవచ్చని అధికారులు చెబుతున్నా ప్రతిపాదన కార్యరూపం దాల్చడంలేదు.

అడగకపోతే అడ్రసు దొరకదు

ఆధునిక సాంకేతిక వ్యవస్థ వచ్చినా ఇప్పటికీ సికింద్రాబాద్‌ నుంచి ఖైరతాబాద్‌లోని చింతల్‌బస్తీలోని బంధువు ఇంటికి వెళ్లాలంటే ఎవరినీ అడగకుండా చేరుకోవడం కష్టమే. ప్రధాన ప్రాంతాలను తెలియజేసే బోర్డులూ చాలా వరకు లేవు. కాలనీల్లో మరీ దారుణం. తిరుపతి నగరంలో స్మార్ట్‌ చిరునామా వ్యవస్థను రూపొందించారు. చేతిలో స్మార్ట్‌ ఫోన్‌ ఉంటే గూగుల్‌కు వెళ్లి వీధి పేరు గానీ ఇంటి నంబరు కానీ నమోదు చేస్తే నేరుగా ఇంటికి దారి చూపుతుంది. దీన్ని నగరంలో ఏర్పాటు చేసేందుకు ప్రణాళిక రూపొందించారు. వ్యవస్థ రూపొందించడానికి ఓ ప్రైవేటు సంస్థ ముందుకొచ్చింది. ఏం జరిగిందో ఆసంగతే మర్చిపోయారు.

బుట్టదాఖలైనవి మరెన్నో..

*● రద్దీ ప్రాంతాలు, వీధి మలుపుల్లో నిర్మించిన కొద్ది కాలానికే తారు రోడ్లు పాడవుతున్నాయి. వైట్‌ ట్యాపింగ్‌ రోడ్లుగా మారిస్తే సమస్య రాదని నిర్ణయించారు. మూడేళ్ల కిందట చింతలబస్తీ, వెంకటరమణ కాలనీ తదితర ప్రాంతాల్లో కొన్నింటిని వైట్‌ట్యాపింగ్‌ రోడ్లగా మార్చడంతో సత్ఫలితాలు వచ్చాయి. మరిన్ని చోట్ల నిర్మించాలన్న ప్రతిపాదన బుట్టదాఖలైంది.

*● నగరంలో ఎన్ని భవనాలున్నాయన్న దానిపై కచ్చితమైన సమాచారం లేదు. కాలనీల వారీగా డ్రోన్లతో సర్వే చేసి డిజిటలైజ్‌ చేయాలని నిర్ణయించారు. మూసాపేటలో సర్వే చేశారు. కొన్ని భవనాలను గుర్తించి పన్ను వేయడం వల్ల జీహెచ్‌ఎంసీకి అదనపు ఆదాయమూ వచ్చింది. తరువాత సర్వే నిలిచిపోయింది.

*● బస్సు టెర్మినళ్లు నిర్మించాలని, నాలాలను విస్తరించాలని నిర్ణయించినా, అమలుకు నోచుకోలేదు.

బండిపై బయటకెళితే బాదుడే

నగర రోడ్లపై నిత్యం 50-60 లక్షల వాహనాలు తిరుగుతుంటాయి. బల్దియా ఆధ్వర్యంలో ఎక్కడా అధికారిక పార్కింగ్‌ వ్యవస్థ లేదు. రోడ్ల మీదే వాహనాలను నిలపాల్సిన పరిస్థితి. ఫలితంగా ట్రాఫిక్‌ స్తంభిస్తోంది. చలానాలు పడుతున్నాయి. సమస్యను పరిష్కరించడానికి దశలవారీగా 30 చోట్ల బహుళంతస్తుల పార్కింగ్‌ సముదాయాలను నిర్మించాలని నిర్ణయించారు. చార్మినార్‌ వద్ద ప్రయోగాత్మకంగా నిర్మించడానికి మూడుసార్లు టెండర్లు పిల్చారు. గుత్తేదారులు ముందుకు రాకపోగా, తమకు గిట్టుబాటు కాదని తెగేసి చెప్పారు.

ఇదీ చదవండి:Huzurabad By Elections: కాంగ్రెస్​కు ఉపఎన్నిక గండం.. ఈసారి రేవంత్​ హస్తవాసి పనిచేసేనా?

ABOUT THE AUTHOR

...view details