Medical Colleges in Telangana : రాష్ట్రంలో మూడు వైద్య కళాశాలల్లో ఎంబీబీఎస్, పీజీ మెడికల్ సీట్లను రద్దు చేస్తున్నట్లు ఎన్‌ఎంసీ ఇటీవలే ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎన్‌ఎంసీ నివేదికలు తాజాగా వెలుగులోకి వచ్చాయి. ఆయా కళాశాలల్లో గుర్తించిన లోపాలను నివేదికల్లో ప్రస్తావించింది. వైద్యవిద్య అభ్యసించేందుకు సంబంధిత కళాశాల అనుబంధ ఆసుపత్రికి రోజువారీగా రావాల్సిన రోగుల సంఖ్య తగినంతగా లేదని పేర్కొంది. తాము జారీ చేసిన నోటీసులకు సంతృప్తికర సమాధానాలు రాకపోవడం వల్లే.. ఆయా కళాశాలల్లో ప్రవేశాలను ఉపసంహరించినట్లు స్పష్టం చేసింది.
నివేదికల్లోని వివరాల ప్రకారం..
* ఓ వైద్య కళాశాలలో అధ్యాపకుల కొరత 59.3 శాతం ఉంది. మరో కళాశాలలో ఇది 50.47 శాతం. ఓ కళాశాలలో రెసిడెంట్లు, ట్యూటర్ల కొరత 66.31 శాతం కాగా.. మరోచోట 23.45 శాతం ఉంది.
* 450 మంది విద్యార్థినులు, విద్యార్థులకు వేర్వేరుగా వసతి సదుపాయం ఉండాల్సిన ఓ కళాశాలలో 192 మంది బాలురకు, 152 మంది బాలికలకే ఉంది.
* సాధారణంగా 150 మంది ఎంబీబీఎస్ విద్యార్థులున్న కళాశాలలోని అనుబంధ ఆసుపత్రికి రోజుకు 1,200 మంది ఔట్‌పేషెంట్లు అవసరం. కానీ, ఓ కళాశాలకు 849 మంది, మరో కళాశాలకు 650 మంది మాత్రమే వస్తున్నారు. వైద్య విద్యార్థుల శిక్షణకు ఈ సంఖ్య సరిపోదు.
* ఓ కళాశాలలో పడకల ఆక్యుపెన్సీ కేవలం 9.38 శాతం కాగా, మరో కళాశాలలో 11.97 శాతమే ఉంది. 650 పడకలు అవసరమున్న ఓ కళాశాలలో 542 మాత్రమే ఉన్నాయి.
* కళాశాలల్లో తగినన్ని రోగ నిర్ధారణ పరీక్షలు జరగడం లేదు. లెక్చర్ హాళ్లు, పరీక్ష కేంద్రాలు సైతం అవసరమైన సంఖ్యలో లేవు. మైనర్ ఆపరేషన్ థియేటర్లు, పీడియాట్రిక్ ఓపీడీ వసతి కొరత ఉంది. విద్యార్థుల శిక్షణకు అవసరమైన ఆల్ట్రాసౌండ్ యంత్రాలు సరిపోయేంతగా లేవు.
లిఖితపూర్వక హామీతో విద్యార్థుల కొనసాగింపు!
మూడు కళాశాలల్లో ప్రవేశాల రద్దు నేపథ్యంలో వాటిలో చదువుతున్న విద్యార్థుల్లో ఆందోళన నెలకొంది. ప్రస్తుతం ఆయా విద్యార్థుల చదువులను అవే కళాశాలల్లో కొనసాగించేలా చర్యలు చేపడతామని వైద్యారోగ్యశాఖ వర్గాలు వెల్లడించాయి. ఈ కళాశాలల్లో 450 మంది ఎంబీబీఎస్, 70 మంది పీజీ వైద్య విద్యార్థులున్నారు. వారందర్నీ ఇతర ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలల్లో సర్దుబాటు చేయడం సాధ్యం కాదంటున్నాయి. నిర్ణీత సమయంలోగా వసతులను కల్పించడంతో పాటు సమస్యలను పరిష్కరిస్తామని ఆయా కళాశాలల నుంచి లిఖితపూర్వక హామీ తీసుకుని విద్యార్థుల్ని కొనసాగించే అవకాశముందంటున్నాయి. ఒకవేళ కళాశాలలపై చర్య తీసుకోవాల్సి వస్తే వచ్చే ఏడాది ప్రవేశాలను నిరాకరించొచ్చని చెబుతున్నాయి. ఎట్టిపరిస్థితుల్లోనూ విద్యార్థులకు ఇబ్బంది కలిగించేలా చర్య తీసుకునే పరిస్థితి ఉండదంటున్నాయి.
ఇవీ చదవండి :ధాన్యం కొనుగోళ్లలో వ్యాపారులదే దందా.. ఐదారు వందలు తగ్గించి దోపిడీ