కరోనా తీవ్రత రోజురోజుకీ పెరుగుతున్న పరిస్థితుల్లో రాష్ట్రంలో పరీక్షలపై ఉత్కంఠ నెలకొంది. ఇంటర్ అడ్వాన్స్ డ్ సప్లిమెంటరీతో పాటు.. ఇంజినీరింగ్, డిగ్రీ, పీజీ, ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలపై ప్రభుత్వం నిర్ణయం కోసం లక్షలాది మంది విద్యార్థులు ఎదురు చూస్తున్నారు. దాదాపు ఈ పరీక్షలన్ని రద్దు చేయాలని ప్రాథమికంగా నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇంటర్ ఫలితాలు ఈనెల 18న విడుదలయ్యాయి. మొదటి సంవత్సరంలో 1,92,172.. రెండో సంవత్సరంలో 1,28,169 మంది పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించలేక పోయారు.
సీఎం నిర్ణయంపై ఉత్కంఠ
సాధారణంగా ఏటా ఫలితాలు ప్రకటించిన రోజునే అడ్వాన్స్ డ్ సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూలు ప్రకటిస్తారు. కానీ ఈ ఏడాది సప్లిమెంటరీ పరీక్ష నిర్వహణపై సందిగ్ధత నెలకొంది. అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలు రద్దు చేయాలని పలు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ప్రభుత్వం కూడా రద్దు చేసే ఆలోచనలోనే ఉన్నట్లు తెలుస్తోంది. దీనిపై ముఖ్యమంత్రి కేసీఆర్ తుది నిర్ణయం కోసం విద్యార్థులతో పాటు అధికారులు వేచి చూస్తున్నారు.
వీటిపై సందిగ్ధం
ఇంజినీరింగ్, డిగ్రీ, పీజీ పరీక్షలపై కూడా విద్యార్థుల్లో ఉత్కంఠ నెలకొంది. ఇంజినీరింగ్ చివరి సెమిస్టర్ పరీక్షలను ఈనెల 20నుంచి నిర్వహించనున్నట్లు గతంలో జేఎన్టీయూహెచ్ ప్రకటించింది. డిగ్రీ చివరి సెమిస్టర్ పరీక్షలకు ఉస్మానియా యూనివర్సిటీ నోటిఫికేషన్ జారీ చేయడంతో.. విద్యార్థుల ఫీజులు చెల్లించారు. డిగ్రీ, పీజీ, ఇంజినీరింగ్ పరీక్షలపై త్వరలో నిర్ణయం తీసుకుంటామని పదో తరగతి పరీక్షలను రద్దు చేసిన రోజునే ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. యూనివర్సిటీలు తమ ఏర్పాట్లను నిలిపివేశాయి.