పాత పంటల జాతర వచ్చేసింది. సంక్రాంతి పర్వదినం పురస్కరించుకుని ఇవాళ సంగారెడ్డి జిల్లాలో డెక్కన్ డెవలప్‌మెంట్ సొసైటీ - డీడీఎస్ ఆధ్వర్యంలో 21వ జీవ వైవిధ్య పండుగ-2021 అట్టహాసంగా ప్రారంభం కానుంది. న్యాల్‌కల్ మండలం శంషల్లాపూర్‌లో నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ప్లాంట్ హెల్త్ మేనేజ్మెంట్-ఎన్‌ఐపీహెచ్‌ఎం డైరెక్టర్ జనరల్ డాక్టర్ జె. అలికా ఆర్‌పీ సుజీతా, నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ అగ్రికల్చర్ ఎక్స్‌టెన్షన్ మేనేజ్మెంట్ - మేనేజ్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ పి. చంద్రశేఖర్... ఈ పండుగ ప్రారంభించనున్నారు. ఫిబ్రవరి 15 వరకు ఉత్సవాలు జరగనున్నాయి.
చిరుధాన్యాల సాగు..
గతంలో అన్ని గ్రామాల మహిళా రైతులు ఎడ్ల బండ్లు కట్టుకుని ఒక ఊరు వస్తే... ఆ గ్రామం నుంచి జాతర ప్రారంభమై కోలాహలం నడుమ ఆ సమూహం అన్ని చోట్ల తిరుగుతూ దేశీయ విత్తనాలు, చిరుధాన్యాలు, సంప్రదాయ పంటలపై ప్రచారం చేయడం అనవాయితీ. కొవిడ్ నేపథ్యంలో ఈ సారి అందుకు భిన్నంగా ఒక్కో గ్రామం వెళ్లి పండుగ నిర్వహించాలని డీడీఎస్ నిర్ణయించింది. పోషక ఘనులు... చిరుధాన్యాలు, పప్పు ధాన్యాలు పండించడం ఎలా...? రసాయన ఎరువులు, క్రిమిసంహారక మందులు వాడకుండా సేంద్రీయ, సహజ పద్ధతుల్లో సాగు, వినియోగదారులు ఎలా వండి తినాలి...? మార్కెటింగ్, ఆదాయాలు పెంచుకోవడం వంటి అంశాలపై ప్రచారం చేస్తారు. పౌష్టికాహార లోపం, జీవన శైలి వ్యాధులు దరిచేరకుండా ఆరోగ్యకమైన బహుళ పోషకాలు గల చిరుధాన్యాల పంటల సాగు, తినడం, ఇతర కుటుంబాలకు చేర్చడంపై రైతుల్లో ఒక చర్చనీయాంశం చేయాలన్నది లక్ష్యమని డీడీఎస్ కో-డైరెక్టర్ చెరుకూరి జయశ్రీ అన్నారు.
మళ్లీ వస్తున్నాయ్..
ఆ పాత పంటలు మళ్లీ వస్తున్నాయ్... మనుషుల ఆహారపు అలవాట్లు మారుతున్నాయి. మళ్లీ పాతతరం పద్ధతుల్లోకి మారిపోతున్నారు. చిరుధాన్యాల విలువేంటో సమాజానికి తెలుస్తోంది. కొర్రాల పాయసం, పచ్చజొన్నల గటక, రాగి జావ లాంటి పేర్లు జనాల నాలుకలపై తిరుగుతున్నాయి. ఆరోగ్యమే మహాభాగ్యం అనే మాటకు సార్ధకత చేకూరుతోంది. గటకే తిన్నామో...! గంజే తాగామో...! అని మాట వరుసకు అంటుంటాం. పేదతిండి అని చెప్పడానికి వాడే ఉపమానం ఇది. నిజానికది గరీబు తిండి కాదు. నిఖార్సయిన తిండి. నిండైన తిండి. గంభీరమైన తిండి. శ్రీమంతుల తిండి. ఇంకా చెప్పాలంటే చిరుధాన్యాలకు మించిన పౌష్టికాహారం ఈ భూమండలం మీదనే లేదు. సన్న బియ్యం, బాసుమతి రైస్ తినడమే హోదా అనుకునే రోజులుపోతున్నాయి. దంపుడు బియ్యం ఎంత రేటున్నాసరే కొంటున్నారు. రాగి అంబలి తాగడానికి క్యూ కడుతున్నారు. ఎండాకాలం సామ బియ్యం తింటే చలువ అని జనానికి అర్ధమైంది. చలికాలం కొర్ర బువ్వ తినాలని ఇప్పుడిప్పుడే అవగతమవుతోంది. పజ్జొన్న రొట్టె, కొర్ర బియ్యం తింటే షుగర్, బీపీ కంట్రోల్ అవుతుందనే అవేర్‌నెస్ వచ్చింది. శ్రీమంతుల ఇళ్లలోనూ పాత పంటల అన్నం దొరుకుతోంది. మనకు లభ్యమయ్యే గింజ ధాన్యాలు ఏ విధంగా ఉపయోగించుకోవచ్చో ప్రజల్లో అవగాహన తీసుకురాలన్నదే పాత పంటల జాతర లక్ష్యమని ఎన్జీ రంగా వ్యవసాయ వర్సిటీ విశ్రాంత డీన్ డాక్టర్ విజయ ఖాదర్ తెలిపారు.
అంతరించిపోతున్న చిరుధాన్యాల పంటలు భవిష్యత్తు తరాలకు తెలియజేయాన్న డీడీఎస్... 21 ఏళ్ల సంకల్పం సత్ఫలితాలిస్తోంది. జహీరాబాద్ ప్రాంతంలో ధ్వంసమైన జీవ వైవిధ్యం ఊపిరిపోసుకుంది. రసాయన, పురుగుమందుల వ్యవసాయం సంప్రదయబాట పట్టింది. ఏటా సంక్రాంతి నాడు మొదలయ్యే ఈ పండుగ ఆసక్తి గొలపడటం ప్రత్యేకత.
ఇదీ చూడండి:పందెంలో ఏ కోడి ఎప్పుడు గెలుస్తుంది.. కోడిశాస్త్రం ఏం చెబుతోంది!