కరోనా వైరస్ ప్రపంచాన్ని వణికిస్తోంది. ఈ మహమ్మారి కారణంగా జనజీవనం అతలాకుతలం అయ్యింది. కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తూనే ఉంది. మహమ్మారిని కట్టడిని చేసేందుకు ఇప్పుడు ప్రజల చేతుల్లో ఉన్న ఒకే ఒక మార్గం వ్యాక్సినేషన్ అని నిపుణులు నొక్కివక్కానిస్తున్నారు. అన్ని దేశాలు వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని వేగవంతం చేశాయి. పలు దేశాల్లో ఇప్పటికే 50 శాతానికిపైగా వ్యాక్సినేషన్ కార్యక్రమం పూర్తి అయ్యింది.
వ్యాక్సిన్ వేసుకుంటే రెండేళ్లలో మరణిస్తామనేది.. నిజమా? అబద్ధమా? - వ్యాక్సిన్లు వందశాతం సురక్షితం
కరోనా సృష్టిస్తోన్న విధ్వంసంపై ప్రపంచమంతా వ్యాక్సిన్ ఆయుధాన్ని ఎక్కుపెడుతోంది. ఇలాంటి తరుణంలో... మరి ఆ వ్యాక్సిన్ నిజంగానే మహమ్మారి కోరలు పీకేసి.. ప్రజలను రక్షిస్తుందా...? ఆ టీకాల వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి..? అనే సందేహాలు ఇప్పటికే పలు మెదళ్లను తొలుస్తున్నాయి. ఇవి సరిపోవన్నట్టు... వ్యాక్సిన్ వేసుకుంటే రెండేళ్లలో చనిపోతామంటూ... ఓ వార్త ఈ మధ్య ప్రచారమవుతోంది. మరి అది నిజమా... వదంతా..?
మరోవైపు... కొంత మంది మాత్రం వ్యాక్సిన్ తీసుకునేందుకు ఇప్పటికీ... జంకుతున్నారు. కొన్ని వదంతులు వారి భయానికి ఆజ్యం పోస్తున్నాయి. ఉన్న అనుమానాలు సరిపోవన్నట్టు.. ఓ షాకింగ్ న్యూస్ ప్రచారంలోకి వచ్చింది. కరోనా వ్యాక్సిన్లు తీసుకున్న వారందరూ రెండేళ్లలో చనిపోతారని ఆ వార్త సారాంశం. ఈ వార్త... వ్యాక్సిన్లు తీసుకున్న వారిని, వ్యాక్సిన్లు తీసుకోబోతున్న వారిని భయాందోళనకు గురి చేస్తోంది. నిపుణులేమో వ్యాక్సిన్లు తప్ప వైరస్‌తో పోరాడే మందు లేదని చెబుతుంటే... టీకాలు తీసుకున్నోళ్లు చనిపోతారన్న వార్తలు రావటం ప్రజలను అయోమయంలోకి నెడుతున్నాయి.
రిస్క్‌లో పెట్టొద్దు...
ఈ వార్తపై 'పీబీఐ ఫ్యాక్ట్ చెక్' నిర్వహించిన పరిశోధనలో అసలు విషయం బయటపడింది. ఆ వార్త పూర్తిగా అసత్యమని స్పష్టం చేసింది. వ్యాక్సిన్లు వందశాతం సురక్షితమని ఉద్ఘాటించింది. ప్రజలు నిశ్చింతగా వ్యాక్సిన్ వేసుకోవచ్చని పేర్కొంది. ఇలాంటి దుష్పచారాలు నమ్మి... వ్యాక్సిన్ వేసుకోకుండా ఆరోగ్యాలు రిస్క్‌లో పెట్టొద్దని సూచించింది. సమాజాన్ని తప్పుదోవ పట్టించి భయాందోళనకు గురిచేసే వదంతులను వ్యాప్తి చేయవద్దని ప్రజలను కోరింది.