Death of Migratory birds: విదేశీ పక్షుల విడిది కేంద్రమైన ఏపీలోని శ్రీకాకుళం జిల్లా టెక్కలి మండలంలోని తేలినీలాపురంలో వలస పక్షులు మృత్యువాత పడుతున్నాయి. నెల వ్యవధిలోనే 100 పక్షులు నేలరాలాయి. ఏటా అక్టోబరులో సైబీరియా నుంచి తేలినీలాపురానికి వచ్చే పెలికాన్ పక్షులు ఏప్రిల్ వరకు ఇక్కడ ఉంటాయి. అధికారుల లెక్కల ప్రకారం ఈసారి దాదాపు 336 పెలికాన్ పక్షులు తేలినీలాపురం వచ్చాయి. 168 చోట్ల గూళ్లు కట్టుకుని పిల్లల్ని పెట్టాయి. అయితే తల్లి పక్షుల్లో 100కు పైగా చనిపోయాయి. పిల్ల పక్షులతో కలిపి ప్రస్తుతం దాదాపు 330 మాత్రమే ఉన్నాయి. డిసెంబరు 26న తొలిసారి రెండు పక్షులు మృతిచెందడం అధికారులు గమనించారు. ఇప్పుడు రోజుకు ఐదు నుంచి పది చొప్పున నేలరాలిపోతున్నాయి. పక్షుల మరణాలకు కారణాలు ఇప్పటివరకూ పూర్తిస్థాయిలో అధికారులు గుర్తించలేకపోయారు.
వైపరీత్యాలెన్నో ఎదుర్కొని..
మూడు దశాబ్దాల కిందట తేలినీలాపురంలో భారీ అగ్నిప్రమాదం సంభవించి చెట్లన్నీ కాలిపోయినా ఆ ప్రాంతంతో తమ అనుబంధాన్ని పెలికాన్ పక్షులు వదులుకోలేదు. 2014లో హుద్‌హుద్ తుపాను, 2018లో తిత్లీ తుపానుకు వృక్షాలన్నీ నేలకొరిగినా మోడువారిన చెట్లపై జీవించాయే తప్ప, ఆ ప్రాంతం నుంచి వెళ్లిపోలేదు. అక్కడికి రాకుండా ఆగలేదు. అలాంటి అతిథుల్ని కాపాడుకొనే చర్యలను అధికారులు తీసుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. అధికారుల వైఖరితో పర్యాటక శోభకు తీరని మచ్చ ఏర్పడే అవకాశముందని స్థానికులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.