కరోనా మృతురాలిని 20 గంటల తర్వాత శవాగారానికి తరలించిన ఘటన... ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లా తెనాలి ప్రభుత్వ ఆసుపత్రిలో చోటుచేసుకుంది. ఆసుపత్రి సిబ్బంది మృతదేహాన్ని తరలించేందుకు అంగీకరించకరించలేదు. దీంతో చివరకు మున్సిపల్ సిబ్బందిని పిలిపించి శవాగారం చేర్చాల్సి వచ్చింది.
కరోనాతో కొద్ది రోజుల క్రితం ఆసుపత్రిలో చేరిన మహిళా రోగి.. శుక్రవారం మధ్యాహ్నం మృతి చెందింది. మృతదేహం తీసుకెళ్లేందుకు బంధువులు ఎవరూ రాలేదు. దీంతో మృతదేహాన్ని కనీసం శవాగారానికి కూడా తరలించకుండా అలాగే ఉంచారు వైద్య సిబ్బంది. వార్డులోని మిగతా రోగులు శుక్రవారం రాత్రంతా బిక్కుబిక్కుమంటూ గడిపారు. ఈ విషయం మీడియాలో ప్రసారం కావటంతో ఉన్నతాధికారులు స్పందించారు. మున్సిపల్ అధికారులకు చెప్పి సిబ్బందిని పంపాలని కోరారు. చివరికి శనివారం ఉదయం 10గంటల సమయంలో మున్సిపల్ సిబ్బంది ఆసుపత్రికి వచ్చి మృతదేహాన్ని శవాగారానికి తీసుకెళ్లారు. పీపీఈ కిట్లు ధరించి ఈ కార్యక్రమం పూర్తి చేశారు. అప్పటి వరకూ మిగతా రోగులు భయంభయంగా గడిపారు.