Dasara rush at all stations: సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులతో ప్రయాణ ప్రాంగణాలకు కిటకిటలాడిపోతున్నాయి. ఒక పక్క రైల్వే స్టేషన్లు, మరొకపక్క బస్ స్టేషన్లు ప్రయాణికులతో రద్దీగా మారిపోయాయి. దక్షిణ మధ్య రైల్వేశాఖ దసరా, దీపావళి పండుగల సందర్బంగా 315 ప్రత్యేక రైళ్లను నడిపిస్తుందని దక్షిణ మధ్య రైల్వే ప్రజా సంబంధాల ముఖ్య అధికారి రాకేష్ తెలిపారు. ప్రయాణికుల సౌకర్యార్థం కొన్ని సర్వీసులకు అదనపు బోగీలను కూడా ఏర్పాటు చేశామన్నారు.
రైల్వే దోపిడి.. సికింద్రాబాద్, కాచిగూడ, నాంపల్లి రైల్వే స్టేషన్లు ప్రయాణికులతో రద్దీగా మారిపోయాయి. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ప్రయాణికులు రైళ్ల సమయవేళలకు ముందుగానే స్టేషన్‌కు చేరుకొని స్టేషన్ వద్ద పడిగాడుపులు కాస్తున్నారు. రాత్రి 10, 11 గంటలకు వెళ్లే రైళ్లకు సైతం.. సాయంత్రం ఆరుగంటలకే స్టేషన్‌కు చేరుకుంటున్నారు. దీంతో రద్దీ భారీగా పెరిగిపోయిందని స్టేషన్ ఇంఛార్జ్‌లు చెబుతున్నారు. ప్రత్యేక రైళ్లకు తత్కాల్ చార్జీలను వసూలు చేస్తున్నట్లు రైల్వేశాఖ తెలిపింది. ఇప్పటికే దాదాపు అన్ని రైళ్లలో రిజర్వేషన్లు అయిపోయాయని ప్రయాణికులు వాపోతున్నారు.
టీఎస్ఆర్టీసీ ప్రత్యేక బస్సులు.. టీఎస్ఆర్టీసీ దసరా పండుగ సందర్భంగా 4,198 ప్రత్యేక బస్సులను నడుపుతోంది. తెలంగాణ రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు 3,795 ప్రత్యేక బస్సులను, ఆంధ్రపదేశ్‌కు 328 ప్రత్యేక బస్సులను, కర్ణాటకకు 75 ప్రత్యేక బస్సులను నడిపిస్తున్నారు. నగరంలోని ప్రధాన బస్ స్టేషన్లు అన్నీ ప్రయాణికులతో రద్దీగా మారిపోయాయి. ప్రధాన బస్ స్టేషన్లు ఎంజీబీఎస్, జేబీఎస్ లతో పాటు దిల్‌సుఖ్ నగర్, లింగంపల్లి, చందానగర్, కేపీహెచ్‌బీ, ఎస్.ఆర్.నగర్, అమీర్ పేట్, ఈసీఐఎల్, ఉప్పల్ క్రాస్ రోడ్, ఎల్.బీ.నగర్ లతో పాటు జంట నగరాలలోని వివిధ శివారు కాలనీల నుంచి ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడుపుతోంది. ప్రత్యేక బస్సులకు ఆర్టీసీ ఎటువంటి అదనపు ఛార్జీలను వసూలు చేయటం లేదు. అయితే పలు స్టేషన్లలో రద్దీ ఎక్కువగా ఉండటం వల్ల బస్సులు అందుబాటులో లేక ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు.