దుర్గాదేవిగా అమ్మవారు దర్శనం ఏపీలోని విజయవాడ ఇంద్రకీలాద్రిపై శ్రీ దుర్గా మళ్లేశ్వర స్వామి వారి దేవస్థానం(vijayawada durga temple)లో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు(navaratri celebrations) వైభవంగా జరుగుతున్నాయి. నవరాత్రుల్లో ఏడో రోజు అమ్మవారు శ్రీ దుర్గాదేవిగా దర్శనమిస్తున్నారు. దుర్గతులను పోగొట్టే దుర్గాదేవి అవతారాన్ని దర్శించుకుంటే సద్గతులు సంప్రాప్తిస్తాయని భక్తుల విశ్వాసం.
దుర్గతులను నాశనం చేసే శ్రీ దుర్గా దేవి అలంకారంతో ‘దుర్గముడు' అనే రాక్షసున్ని సంహరించింది అమ్మవారు. అష్టమి రోజునే కనుక ఈ రోజును దుర్గాష్టమి అని, దుర్గమున్ని సంహరించిన అవతారం కావున దేవిని ‘దుర్గా' అని పిలుస్తారు. శ్రీ దుర్గాదేవి ఉగ్ర స్వరూపిణి కావున ఈ దేవిని దుర్గా అష్టోత్తారాలు, దుర్గా సహస్రనామాలకు బదులు శ్రీ లలితా అష్టోత్తరాలు, శ్రీ లలిత సహస్రనామాలతో పూజిస్తారు.
దసరా నవరాత్రుల్లో అమ్మవారికి ఒక్కోరోజు ఒక్కో రూపం ఉన్నట్లే.. నైవేద్యం కూడా ప్రతీరోజు ప్రత్యేకంగా ఉంటుంది. అమ్మవారికి ఏడో రోజు అంటే.. ఆశ్వయుజ శుద్ధ అష్టమి అమ్మవారికి అత్యంత ప్రీతిపాత్రమైన చక్కెరపొంగలి నివేదించాలి. ఇలా చేస్తే అమ్మవారు కటాక్షిస్తుందని భక్తుల నమ్మకం.
చివరి భక్తుడి వరకు దర్శనం..
ఇంద్రకీలాద్రిపై(vijayawada durga temple) దుర్గమ్మను మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు దర్శించుకున్నారు. ప్రజలందరికీ అమ్మవారి ఆశీస్సులు ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు. మంగళవారం మూలానక్షత్రం రోజున లక్ష మందికిపైగా స్వామివారిని దర్శించుకున్నారని వెల్లంపల్లి స్పష్టం చేశారు. అధిక సంఖ్యలో వచ్చినా చివరి భక్తుడి వరకు దర్శనం కల్పించామన్నారు.
పోలీసుల పాత్ర కీలకం
ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మను డీజీపీ గౌతమ్ సవాంగ్ దర్శించుకున్నారు. ఆలయం వద్దకు చేరుకున్న డీజీపీకి ఆలయ అధికారులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అమ్మవారి దర్శనం అనంతరం వేద పండితులు వేద ఆశీర్వచనం అందించారు. దసరా నవరాత్రులలో అమ్మవారిని దర్శించుకోవడం సంతోషంగా ఉందని గౌతమ్ సవాంగ్ అన్నారు. దసరా శరన్నవరాత్రిలో పోలీసుల పాత్ర చాలా కీలకమైందని.. విధి నిర్వహణలో ఉన్న పోలీసులు అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. దసరా ఉత్సవాలలో పోలీసులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారన్నారు.
ఇదీ చదవండి: Bathukamma 2021 special: మీకు తెలుసా.. బతుకమ్మను పేర్చడానికి ఆ పూలే ఎందుకు వాడతారో?