Dangerous Hoardings in Vijayawada: వ్యాపార, వాణిజ్య రాజధానిగా పేరుగాంచిన విజయవాడలో ప్రచార హోర్డింగ్‌లు ప్రమాదాలకు నెలవుగా మారాయి. నగరంలోనూ ముఖ్య ప్రాంతాలైనా బందర్‌రోడ్డు, ఏలూరురోడ్డు, వన్‌టౌన్‌లో భారీ ఎత్తున వ్యాపార ప్రకటన హోర్డింగ్స్ ఏర్పాటు చేశారు. బహుళ అంతస్తులపై.. యజమానులకు అద్దె ఆశ చూపి భారీ హోర్డింగ్స్‌ను పెడుతున్నారు. సరైన పునాది లేకుండా అరకొర రక్షణ చర్యలతో ఏర్పాటు చేస్తున్న ఈ భారీ హోర్డింగ్స్.. చిన్నపాటి గాలికి కూలిపోతున్నాయి. దీంతో రహదారిపై వెళ్లే వారు ప్రమాదాలకు గురవ్వడమే గాక.. హోర్డింగ్స్ ఏర్పాటు చేసిన ఇళ్లు సైతం దెబ్బతింటున్నాయి.
ప్రకటన సంస్థల నిర్వాహణ లోపంతో హోర్డింగ్స్ బలహీనపడుతున్నాయి. వర్షాకాలంలో బందరు రోడ్డు, ఏలూరు రోడ్డులో వెళ్లాలంటే వాహనదారులు భయపడుతున్నారు. భారీ వర్షం, ఈదురు గాలులకు హోర్డింగ్స్ విరిగిపడి ప్రమాదాలు జరుగుతున్నాయి. నగరంలో దాదాపు 250 హోర్డింగ్స్ వరకు ఉండగా, వాటిల్లో 50కి పైగా నివాసాలపైనే ఉన్నాయని కార్పొరేషన్ అధికారులు చెబుతున్నారు. వర్షాలు, ఈదురుగాలులు వీస్తున్న సమయంలో.. భవన యజమానులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. సరిగా లేని హోర్డింగ్స్‌ను పట్టణ ప్రణాళిక సిబ్బందితో తొలగిస్తున్నామని తెలిపారు.