సంపాదించే మొత్తంలో కొంతైనా సమాజ హితానికి కేటాయించాలని జలమండలి ఎండీ దానకిశోర్ సూచించారు. రాజీవ్‌నగర్ కాలనీలో జరిగిన విద్యావికాస్ స్వచ్ఛంద సంస్థ తొమ్మిదో వార్షికోత్సవానికి ఈనాడు పాత్రికేయ పాఠశాల ప్రిన్సిపల్ ఎం.నాగేశ్వరరావుతో కలిసి ఆయన పాల్గొన్నారు. రాజీవ్‌నగర్ కాలనీ అంటే తనకు ఎంతో ఇష్టమంటూ.. 'విద్యావికాస్' కోసం రూ. 10 వేల ఆర్థిక సాయం అందించారు.
చిన్నారుల మనస్సు తెల్ల కాగితం లాంటిదని.. దానిని ఎలా వినియోగిస్తే అలా ఉపయోగపడుతుందని ఎం.నాగేశ్వరరావు అన్నారు. పిల్లలకు అర్థమయ్యే రీతిలో మంచి చెడుల మధ్య బేధాన్ని వివరించాలని సూచించారు. సమాజానికి ఉపయోగపడే ఉన్నత స్థాయికి రాజీవ్‌నగర్ కాలనీ విద్యార్థులు ఎదగాలని ఆకాంక్షించారు. పిల్లలకు చరవాణి వినియోగం వ్యసనంగా మారకుండా తల్లిదండ్రులు జాగ్రత్తపడాలని ఎం.నాగేశ్వరరావు సూచించారు. ఖాళీ సమయాల్లో పుస్తక పఠనం అలవాటు చేయాలన్నారు. చిన్నారులు కనీస నిద్ర, నీరు అందేలా తల్లిదండ్రులు చూడాలని తెలిపారు.