నీటిపారుదల శాఖ పరిధిలో అనేక కొత్త ప్రాజెక్టులు వచ్చి చేరుతున్నాయి. అయితే, ఇప్పటికే ఉన్న వాటి నిర్వహణ విషయంలో మాత్రం ఆ శాఖ వెనకబడి పోయిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. వేల ఎకరాల ఆయకట్టు, లక్షల మందికి తాగునీటి వసతి కల్పించే ఈ ప్రాజెక్టుల నిర్వహణ నానాటికీ తీసికట్టుగా మారుతోంది. పాత ప్రాజెక్టుల నిర్వహణ లోపభూయిష్టంగా ఉండటంతో ఒకదాని వెంట మరొకటి ప్రమాదకర పరిస్థితిని ఎదుర్కొంటోంది. రెండేళ్ల క్రితం రాష్ట్రంలో ‘ఓ అండ్ ఎం’ (ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్) విభాగాన్ని ప్రత్యేకంగా ఏర్పాటు చేసినప్పటికీ ఫలితాలు ఇంకా కనిపించడం లేదన్న అభిప్రాయం వినిపిస్తోంది.
గడిచిన ఎనిమిదేళ్లుగా రాష్ట్ర ప్రభుత్వం మొదటి ప్రాధాన్య అంశంగా ప్రాజెక్టుల నిర్మాణాన్ని చేపడుతూ వస్తోంది. సింహభాగం నిధులు కూడా ఈ రంగానికే కేటాయిస్తోంది. ‘ఓ అండ్ ఎం’ విభాగం ఏర్పాటు చేయడంతోపాటు ప్రభుత్వం ప్రత్యేక బడ్జెట్‌నూ కేటాయిస్తూ వస్తోంది. వర్షాకాలం ప్రారంభంకాకముందే ప్రాజెక్టులు, ఎత్తిపోతల నిర్వహణపై సమీక్షలు చేపట్టి మరమ్మతులు చేయాల్సిన బాధ్యత ఈ విభాగంపై ఉంది. రెండేళ్ల నుంచి జూరాల, నాగార్జునసాగర్ ప్రాజెక్టుల మరమ్మతులకు సంబంధించి నిధుల విడుదల, టెండర్ల ఖరారు, పనుల ప్రారంభం విషయంలో ఆశించిన పురోగతి లేకపోవడం చర్చనీయాంశంగా మారింది. మరోవైపు నీటిపారుదల శాఖలో పెద్దఎత్తున పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఒక్కో భారీ ప్రాజెక్టుకు 30 మందికి పైగా సిబ్బంది అవసరం ఉండగా.. సగం మంది కూడా లేరు. ఏటా ఆనకట్టల భద్రత పర్యవేక్షణ కమిటీ ఇచ్చే నివేదికలను అమలు చేయడంలోనూ వెనుకంజలో ఉన్నట్లు విమర్శలున్నాయి.