తెలంగాణ

telangana

ETV Bharat / city

Dalit Bandhu scheme in huzurabad : దళితబంధు నగదుతో.. 70% ట్రాక్టర్లు, కార్ల కొనుగోళ్లు - cars purchase with dalt bandhu money

‘సార్‌...! రూ.10 లక్షలతో సొంతంగా కారు కొని అద్దెకు ఇస్తా. లేకుంటే నేనే నడుపుతా’. ‘నియోజకవర్గంలో వ్యవసాయ పనులకు డిమాండ్‌ ఎక్కువ. అందుకే ట్రాక్టర్‌ కొంటా’... దళితబంధు లబ్ధిదారులు అధికారులకు చెబుతున్న స్వయం ఉపాధి పథకాలివి. 70 శాతానికి పైగా లబ్ధిదారులు వీటితోనే ఉపాధి పొందాలని భావిస్తున్నారు.

దళితబంధు నగదుతో.. 70% ట్రాక్టర్లు, కార్ల కొనుగోళ్లు
దళితబంధు నగదుతో.. 70% ట్రాక్టర్లు, కార్ల కొనుగోళ్లు

By

Published : Sep 23, 2021, 11:03 AM IST

తెలంగాణలో వెనకబడిన దళితవర్గాన్ని అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర సర్కార్ దళిత బంధు పథకాన్ని ప్రారంభించింది. మొదట పైలట్ ప్రాజెక్టుగా నల్గొండ జిల్లా వాసాలమర్రిలో ప్రవేశపెట్టిన ప్రభుత్వం.. తర్వాత హుజూరాబాద్​ నియోజకవర్గంలో అమలు చేస్తోంది. ఈ పథకంలో భాగంగా.. ఉత్పత్తి, తయారీ రంగాలను ప్రోత్సాహించాలని సర్కార్ యోచన చేసినప్పటికీ.. లబ్ధిదారులు ఎక్కువగా సేవారంగానికి ప్రాధాన్యమిస్తున్నారు. ఈ పథకంలో భాగంగా 70 శాతానికి పైగా లబ్ధిదారులు ట్రాక్టర్, కార్లు కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.

హుజూరాబాద్‌లో దళితబంధును ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్న ప్రభుత్వం ఇప్పటికే రూ.2 వేల కోట్లు విడుదల చేసింది. 2014లో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వే ప్రకారం... హుజూరాబాద్‌ నియోజకవర్గంలో దాదాపు 20 వేల ఎస్సీ కుటుంబాలున్నాయి. ఇప్పుడు దళితబంధు కోసం లెక్కలు వేయగా, దాదాపు 25 వేల కుటుంబాలున్నట్లు తేలింది. లబ్ధిదారుల దరఖాస్తులను అధికారులు పరిశీలించి నిధులు మంజూరు చేస్తున్నారు. ఇప్పటివరకు 18 వేల కుటుంబాల బ్యాంకు ఖాతాల్లో రూ.10 లక్షల చొప్పున నిధులు జమయ్యాయి. స్వయం ఉపాధి పథకానికి అధికారులు ఆమోదం తెలిపిన తరువాత ఆ నిధులను వినియోగించుకునే వీలుంది.

ఎక్కువ మంది కార్లు, ట్రాక్టర్లు కోరుకోవడంతో, మెరుగైన ఆదాయం పొందే ఇతర పథకాల గురించి అధికారులు వారికి వివరిస్తున్నారు. కార్లు, ట్రాక్టర్లు ఎక్కువ మంది తీసుకుంటే డిమాండ్‌, ఆదాయం తగ్గే ప్రమాదముందని సూచిస్తున్నారు. వారం, పది రోజుల్లో అర్హత కలిగిన దళిత కుటుంబాలన్నిటికీ రూ.10 లక్షల చొప్పున నగదు జమయ్యే అవకాశముందని తెలుస్తోంది.

ఎక్కువ మొత్తంలో ట్రాక్టర్లు, కార్లు తీసుకుంటే ఫలితం ఉండదని... లబ్దిదారులకు మరోమారు కౌన్సెలింగ్ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. సేవారంగానికి సంబంధించినవి కాకుండా తయారీ రంగం యూనిట్లను ప్రోత్సహిస్తే ప్రయోజనకరంగా ఉంటుందని తెలిపింది. డెయిరీ యూనిట్లను వీలైనంత ఎక్కువగా ప్రోత్సహించాలని ప్రజాప్రతినిధులు, అధికారులకు ముఖ్యమంత్రి కేసీఆర్ సూచించారు. ప్రభుత్వ సహకార డెయిరీలు ఉన్న నేపథ్యంలో ఇది అన్ని రకాలుగా సజావుగా సాగుతుందని, ప్రయోజనకరంగా ఉంటుందని అన్నారు. డెయిరీ రంగానికి మంచి డిమాండ్, భవిష్యత్ ఉందని... ప్రజలకు కూడా మంచి పాలు, పాల ఉత్పత్తులు లభిస్తాయని తెలిపారు.

దళితబంధులో డెయిరీ యూనిట్లు ప్రొత్సహించేందుకు తగిన కార్యాచరణ రూపొందించాలని, ప్రభుత్వ డైరీ యూనిట్లు ప్రోత్సహించాలని చెప్పారు. దళితబంధు లబ్దిదారులు డెయిరీ యూనిట్లు, డెయిరీ పరిశ్రమల ఏర్పాటుకు ముందుకు వస్తే అవకాశం ఉన్న చోట ప్రభుత్వ భూములను ఉచితంగా కేటాయిస్తామని కూడా సీఎం వెల్లడించారు.

ABOUT THE AUTHOR

...view details