రాష్ట్ర మంత్రి మండలి నేడు సమావేశం కానుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన మధ్యాహ్నం భేటీ జరగనుంది. దళితబంధు పథకమే ప్రధాన అజెండాగా సమావేశం జరిగే అవకాశం ఉంది. అఖిలపక్ష ప్రతినిధులు, హుజూరాబాద్ దళిత ప్రతినిధుల సమావేశంలో వచ్చిన అభిప్రాయాల ఆధారంగా పథకం అమలుపై చర్చించనున్నారు. దళితబంధు మార్గదర్శకాలపైనా కేబినెట్ భేటీలో చర్చిస్తారు.
పైలట్ ప్రాజెక్టుకు ఆమోదం..
ఉపాధి అవకాశాల కోసం ఎస్సీ అభివృద్ధి శాఖ ఇప్పటికే వివిధ యూనిట్లను గుర్తించింది. గ్రామీణ, సబర్బన్, పట్టణ ప్రాంతాలకు వేర్వేరుగా వీటిని సిద్ధం చేశారు. యూనిట్ల ఏర్పాటు కోసం పది లక్షల రూపాయలు లబ్దిదారుల బ్యాంకు ఖాతాల్లో జమ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దళితబంధు పథకంతో పాటు హుజూరాబాద్ నియోజకవర్గంలో పైలట్ ప్రాజెక్టుకు మంత్రిమండలి ఆమోదం తెలపనుంది. మార్గదర్శకాల ఖరారు విషయమై కూడా కేబినెట్లో చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. పథకం అమలు, కార్యాచరణపై చర్చించి కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. దీంతో పాటు దళితవాడల అభివృద్ధి, మౌలికసదుపాయాల కల్పన తదితర అంశాలపైనా కేబినెట్లో చర్చించనున్నారు.
ఉద్యోగ నియామకాలపై చర్చ..
ఉద్యోగ నియామకాలపైనా కూడా మంత్రివర్గంలో చర్చించే అవకాశం ఉంది. కొత్త జోనల్ విధానానికి అనుగుణంగా కేడర్ వర్గీకరణ పూర్తి చేసి ఐదు రోజుల్లో వివరాలు ఇవ్వాలని గత కేబినెట్ సమావేశంలో ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులను ఆదేశించారు. అందుకు అనుగుణంగా ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు అన్ని శాఖల మంత్రులు, అధికారులతో చర్చించి వివరాలు సిద్ధం చేశారు. అన్నింటినీ క్రోడీకరించి ఆర్థిక శాఖ సమగ్ర నివేదికను సిద్ధం చేసింది. వివరాలను పరిశీలించి ఉద్యోగ నియామక ప్రక్రియపై కేబినెట్ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.