గ్రేటర్‌లో కరోనా హోరు పెంచింది. ఒకే రోజు ఏకంగా 122 కేసులు నమోదవడం కలవరానికి గురిచేసింది. నగరంలో కొవిడ్-19 కేసులు ప్రారంభమయ్యాక ఇదే అత్యధికం కావడం గమనార్హం. ఖైరతాబాద్, ముషీరాబాద్, చాదర్‌ఘాట్ ప్రాంతాల్లో కరోనా బారినపడి చికిత్స పొందుతున్న వారిలో నలుగురు మరణించారు. పిన్నల నుంచి పెద్దల వరకు ఎవర్నీ మహమ్మారి వదలట్లేదు. ముషీరాబాద్, జియాగూడ, పహాడీషరీఫ్, మంగళ్‌హాట్, కుల్సుంపురా తదితర ప్రాంతాల్లో వైరస్ వేగంగా విస్తరిస్తుండడంతో ప్రజలు వణికిపోతున్నారు.
పహాడీషరీఫ్‌లో అన్నదమ్ములకు చెందిన ఐదు కుటుంబాల్లో 43 మంది వైరస్ బారిన పడి ఆసుపత్రి పాలయ్యారు. జియాగూడలో ఉంటున్న సోదరుడి ఇంటికి వెళ్లొచ్చిన సోదరితో ఇక్కడి వారికి వైరస్ వ్యాపించినట్టు గుర్తించారు. జనసాంద్రత అధికంగా ఉండే బస్తీల్లో కేసులు పెరగటం అధికార యంత్రాంగాన్ని ఆందోళనకు గుర్తిచేస్తోంది. లాక్‌డౌన్ నిబంధనల్లో కొన్ని అమల్లో ఉన్నా క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ కొరవడటం సమస్యగా మారింది. ఆదివారం కావటంతో కూరగాయలు, మాంసం, చేపల మార్కెట్ల వద్ద రద్దీ వాతావరణం కనిపించింది. పలువురు వ్యాపారులు, కొనుగోలుదారులు వ్యక్తిగత దూరం, ముఖానికి మాస్క్‌లు ధరించకుండానే తిరిగారు. కొత్తగా నమోదవుతున్న కేసుల్లో చిరువ్యాపారులు, కార్పొరేట్ ఉద్యోగులు చేరుతున్నారు. వీరిలో ఎటువంటి లక్షణాలు కనిపించకపోవటంతో సాధారణ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. దీంతో వీరు ఎవరితో సన్నిహితంగా మెలిగారనే వివరాలు సేకరించటం తలనొప్పిగా మారిందని అధికారులు అంటున్నారు.