Asani Cyclone: బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తుపానుగా మారింది. ఈ తుపానుకు "అసని"గా నామకరణం చేశారు. గంటకు 16 కి.మీ వేగంతో కదులుతున్న ఈ తుపాను.. ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నానికి ఆగ్నేయంగా 970 కి.మీ దూరంలో ఉంది. ఒడిశా పూరీకి 1030 కి.మీ దూరంలో ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. వాయువ్య దిశగా కదులుతున్న ఈ అసని తుపాను.. రాబోయే 24 గంటల్లో మరింత బలపడి తీవ్ర తుపానుగా మారనుందని వెల్లడించారు. మే 10న ఒడిశా తీరంలో వాయువ్య బంగాళాఖాతంలో ఇది బలహీన పడే అవకాశం ఉందన్నారు.
అసని ప్రభావంతో తీర ప్రాంతాల్లో గంటకు 70 నుంచి 90 కి.మీ వేగంతో గాలులు వీయనున్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. నేటి అర్ధరాత్రి నుంచి గంటకు 105 నుంచి 125 కి.మీ వేగంతో గాలులు వీయనున్నాయి. తుపాను ప్రభావంతో కొన్నిచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని.. తీర ప్రాంతాల్లో భారీ వర్షపాతం నమోదు కానుందని తెలిపారు.
10వ తేదీ సాయంత్రం నుంచి ఒడిశా తీర ప్రాంతం, ఆంధ్రప్రదేశ్ లోని ఉత్తర కోస్తా పరిసర ప్రాంతాల మీదుగా అసని సాగనుంది. తుపాను ప్రభావంతో కోస్తాలో కొన్నిచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. మత్స్యకారులు మే 9, 10 తేదీల్లో బంగాళాఖాతం మధ్య ప్రాంతాల్లోకి వేటకు వెళ్లవద్దని వాతావరణ శాఖ అధికారులు సూచించారు.