ఎన్‌కౌంటర్ జరిగిన తీరు, అందుకు గల కారణాలను సీపీ మీడియాకు వివరించారు. ‘‘గత నెల 28న ఉదయం దిశను చటాన్‌పల్లి వద్ద కాల్చివేశారు. ఆ తర్వాత నిందితులను పట్టుకుని 30న మెజిస్ట్రేట్ వద్ద హాజరుపరిచాం. 10 రోజుల జ్యుడిషియల్ కస్టడీకి ఇచ్చారు. ఈనెల 4న నిందితులను చర్లపల్లి జైలు నుంచి కస్టడీకి తీసుకున్నాం.
సీన్ రీకన్‌స్ట్రక్షన్ కోసం రాలేదు...
నిందితులను అనేక విషయాలు ప్రశ్నించాం. రెండు రోజుల కస్టడీలో నిందితులు చాలా విషయాలు చెప్పారు. సీన్ రీకన్‌స్ట్రక్షన్ కోసం అక్కడకు తీసుకెళ్లలేదు. దిశకు సంబంధించిన వస్తువులు చూపెడతామంటే నిందితులను చటాన్‌పల్లి వద్దకు తీసుకొచ్చాం. దిశ ఫోన్, వాచీ, పవర్‌బ్యాంక్ దాచిన చోటుకు వారిని తీసుకెళ్లాం.
రాళ్లు, కర్రలతో పోలీసులపై దాడి...
రాళ్లు, కర్రలతో పోలీసులపై నిందితులు దాడికి పాల్పడ్డారు. మహ్మద్ ఆరిఫ్, చెన్నకేశవులు పోలీసుల వద్ద తుపాకులు లాక్కుని కాల్పులకు యత్నించారు. పోలీసులు పలుమార్లు హెచ్చరించినా వినకపోవడంతో నిందితులపై కాల్పులు జరిపారు.
కాల్పులు ఏ సమయంలో జరిగాయంటే...
ఈ ఉదయం 5.45 నుంచి 6.15 గంటల ప్రాంతంలో కాల్పులు జరిగాయి. నిందితులు జరిపిన రాళ్లదాడిలో నందిగామ ఎస్సై వెంకటేశ్వర్లు కానిస్టేబుల్ అరవింద్‌గౌడ్‌కు గాయాలయ్యాయి. వారిని స్థానికంగా ప్రథమ చికిత్స అందించి కేర్ ఆస్పత్రికి తరలించాం. పోలీసులకు బుల్లెట్ గాయాలు కాలేదు.