తెలంగాణ

telangana

ETV Bharat / city

'ప్రజలకు, పోలీసులకు మధ్య సత్సంబంధాలు మెరుగుపడాలి'

భాగ్యనగర ఐటీ కారిడార్ భద్రతే ధ్యేయంగా ఏర్పడిన సొసైటీ ఫర్ సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ 15ఏళ్ల ప్రస్థానాన్ని పూర్తి చేసుకుంది. పోలీసులు, ఐటీ సంస్థల ప్రతినిధులతో ఏర్పడిన ఎస్సీఎస్సీ... క్రమంగా ఇతర రంగాలకు విస్తరించింది. ఔషద, స్థిరాస్తి, విద్యా సంస్థలు భాగస్వామ్యమవడంతో సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ సేవలు విస్తరించాయి. ఐటీ కంపెనీలు, అందులో పనిచేసే ఉద్యోగుల భద్రతతో పాటు.... సామాజిక సేవా కార్యక్రమాల్లోనూ ఎస్సీఎస్సీ పాలు పంచుకుంటోంది.

Society for Cyberabad Security Council
'ప్రజలకు, పోలీసులకు మధ్య సత్సంబంధాలు మెరుగుపడాలి'

By

Published : Jan 30, 2021, 9:03 AM IST

ప్రజలకు, పోలీసులకు మధ్య సత్సంబంధాలు మెరుగుపడాలని, అప్పుడే నేరాలు తగ్గుముఖం పడతాయని రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమూద్‌ అలీ అన్నారు. శుక్రవారం హైటెక్‌ సిటీలోని హెచ్‌ఐసీసీలో నిర్వహించిన సొసైటీ ఫర్‌ సైబరాబాద్‌ సెక్యూరిటీ కౌన్సిల్‌ (ఎస్‌సీఎస్‌సీ) 15వ వార్షికోత్సవానికి ఆయన హాజరయ్యారు. రాష్ట్రంలో మహిళల భద్రతపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందన్నారు.. నేరాల నియంత్రణలో సాంకేతిక పరిజ్ఞానం కీలక పాత్ర పోషిస్తుందని, ఈ విషయంలో తెలంగాణ పోలీసులు దేశంలోనే మొదటి స్థానంలో నిలిచారన్నారు. పోలీసులు, ఐటీ పరిశ్రమల మధ్య ఎస్‌సీఎస్‌సీ వారధిలా పనిచేస్తుందన్నారు. ఐటీఈఎస్‌, ఫార్మా, హెల్త్‌కేర్‌, ఎంటర్‌టైన్‌మెంట్‌ తదితర రంగాలకు సంబంధించిన పరిశ్రమలను కూడా ఇందులో భాగస్వామ్యం చేయాలని సూచించారు.

ఫోన్‌ వచ్చిన 5 నిమిషాల్లోనే..

‘అన్ని కమిషనరేట్లు, జిల్లాల్లో ఎస్‌సీఎస్‌సీ మాదిరిగానే ప్రత్యేక వేదికల ఏర్పాటుకు కసరత్తు ప్రారంభించాం. హైదరాబాద్‌లో డయల్‌ 100కు ఫోన్‌ వచ్చిన 5 నిమిషాల్లో పెట్రోలింగ్‌ వాహనం చేరుకుంటుంది. గ్రామీణ ప్రాంతాల్లో 8 నిమిషాలు పడుతుంది. అన్ని ఠాణాల్లోనూ కంప్యూటర్లను ఏర్పాటు చేసి నెట్‌వర్క్‌ ద్వారా కమిషనరేట్‌, ఎస్పీ కార్యాలయానికి అనుసంధానించాం. నేరం జరిగిన 24 గంటల్లోనే నిందితులను పట్టుకుంటున్నాం. టీఎస్‌ కాప్‌ యాప్‌ ద్వారా ఒక్క క్లిక్‌తోనే 80 వేల మంది సిబ్బందిని అప్రమత్తం చేసేలా ఏర్పాట్లు చేశాం’- మహేందర్‌రెడ్డి, డీజీపీ.

ఠాణాలకు నేరుగా వచ్చి...


‘మహిళల భద్రతకు పోలీసులు తీసుకుంటున్న చర్యలు వారికి భరోసానిస్తున్నాయి.’ అని అదనపు డీజీపీ స్వాతిలక్రా అన్నారు. ‘రాబోయే రోజుల్లో పోలీసులకు మరిన్ని సవాళ్లు ఎదురు కానున్నాయి.’ అని హైదరాబాద్‌ సీపీ అంజనీకుమార్‌ అన్నారు. ‘‘రోజువారీ పోలీసింగ్‌లో ప్రజలను భాగస్వామ్యం చేయాల్సిన అవసరముంది’ అని రాచకొండ సీపీ మహేష్‌ భగవత్‌ అన్నారు. ‘సైబరాబాద్‌ కమిషనరేట్‌లో సైబర్‌ భద్రతపై ‘సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్సీ’ని ప్రారంభించనున్నాం. అని సీపీ సజ్జనార్‌ వివరించారు. భారత్‌ బయోటెక్‌ జేఎండీ సుచిత్ర ఎల్లా, సైయంట్‌ వ్యవస్థాపక ఛైర్మన్‌ బీవీఆర్‌ మోహన్‌రెడ్డి, ఐటీ కార్యదర్శి జయేష్‌ రంజన్‌, ఎస్‌సీఎస్‌సీ ప్రతినిధులు పాల్గొన్నారు.

ఆ రోజు కన్నీళ్లొచ్చాయి..

లాక్‌డౌన్‌లో పోలీసుల మాదిరిగానే నిరంతరాయంగా పనిచేశాం. కరోనా వ్యాక్సిన్‌ ‘కొవాగ్జీన్‌’ రూపకల్పనలో మహిళా ఉద్యోగుల పాత్ర కీలకమైనది. రేయింబవళ్లు కష్టపడ్డారు. ఈ నెల 13న తెల్లవారుజామున పోలీస్‌ బందోబస్తు నడుమ తొలి ట్రక్కు శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయానికి బయలుదేరేందుకు సిద్ధంగా ఉంది. వందలాది మంది ఉద్యోగులు సంతోషంతో చప్పట్లు కొడుతున్నారు. నేను ఇంట్లో వర్చువల్‌ విధానంలో ఆ కార్యక్రమాన్ని చూశా. నాకు తెలియకుండానే కన్నీళ్లొచ్చాయి. ఆ క్షణం దేశ సేవలో భాగమయ్యామనే సంతృప్తినిచ్చింది. పోలీసుల మాదిరిగానే సమాజ హితం కోసం పనిచేయాలన్నదే మా సంస్థ లక్ష్యం. ఈ విషయంలో రాజీ పడేదే లేదు. పోలీసులు, ప్రభుత్వ సహకారంతోనే దేశ, విదేశాలకు కరోనా వ్యాక్సిన్‌ను అందించగలుగుతున్నాం. మహిళలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలి. చదువుతో పాటు నైపుణ్యాల పెంపుపై దృష్టి సారించాలి. హైదరాబాద్‌ సురక్షిత నగరం. ఒక నాలెడ్జ్‌ సెంటర్‌. విదేశాలకు వలస వెళ్లకుండా ఇక్కడే ఉండి దేశాభివృద్ధిలో పాల్పంచుకోవాలి. - సుచిత్ర ఎల్లా, భారత్‌ బయోటెక్‌ జేఎండీ.

ఇవీ చూడండి:పోలీసులు, పరిశ్రమలకు వారధిగా ఎస్సీఎస్సీ: హోం మంత్రి

ABOUT THE AUTHOR

...view details