- Husband And Wife Fights : గచ్చిబౌలికి చెందిన దంపతులు. పెళ్లయి మూడేళ్లవుతోంది.. రెండేళ్ల వయసున్న కూతురు. కొద్దికాలంగా ఇద్దరి మధ్య మనస్పర్థలు పెరిగాయి. భార్యపై చేయిచేసుకునే వరకూ చేరటంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారికి మానసిక నిపుణుల ద్వారా కౌన్సెలింగ్ ఇచ్చి తప్పొప్పులు తెలుసుకునేలా చేశారు. ‘సెలవు రోజు సరదాగా గడిపేందుకు బయటకు వెళ్దామంటే వినకుండా.. తన తల్లిదండ్రులు, సోదరులకే ప్రాధాన్యమివ్వటమే భర్తతో గొడవ పడేందుకు కారణమని భార్య ఇచ్చిన సమాధానం.
- Couple Fights in Hyderabad : నాలుగేళ్లు ప్రేమించుకుని పెద్దలను ఒప్పించి ఒకటైన జంట. కూకట్‌పల్లిలో సొంతిల్లు. ఆర్థిక ఇబ్బందుల్లేవు. బాబు పుట్టాక దంపతుల మధ్య గొడవలు మొదలయ్యాయి. చిన్నవిషయానికే భార్య అరచి కేకలు పెడుతుందనేది అతడి ఆవేదన. నిన్నటి వరకూ ప్రేమగా చూసుకున్న భర్తలో మార్పు వచ్చిందనేది ఆమె ఆందోళన. 3 నెలల పసికందుతో ఒంటరిగా బతుకుతానంటూ హంగామా. తీరా కౌన్సెలింగ్‌లో తేలిన విషయం ఏమిటంటే.. ప్రసవానంతరం ఆమె మానసిక ఒత్తిడికి గురైంది. ఇద్దరికీ దీనిపై అవగాహన లేకపోవటంతో పోలీస్ స్టేషన్ వరకూ చేరారు.
Relationship Issues : సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలో ఏటేటా గృహహింస ఫిర్యాదులు పెరుగుతున్నాయి. డయల్ 100 ద్వారా వచ్చే ఫోన్‌కాల్స్‌లో 35-40శాతం ఆలుమగల కీచులాటలే ఉంటున్నాయి. 2018లో గృహహింస కేసులు 78 నమోదైతే 2021 నాటికి అది 509కి చేరింది. 2022 మార్చి 24 వరకూ 101 కేసులు నమోదయ్యాయి. ఉద్యోగ, వృత్తిపరమైన ఒత్తిళ్లు. ఆర్థిక, కుటుంబ, వ్యక్తిగత అంశాలు దంపతుల మధ్య చిచ్చుపెడుతున్నాయి. నిప్పు, ఉప్పులా మారిన బిడ్డలను ఏకం చేయాల్సిన పెద్దలు మరింత రెచ్చగొడుతున్నారు. తమ కొడుకు/కూతురు వెనక్కితగ్గటాన్ని జీర్ణించు కోలేకపోతున్నారు. మాటలతో రెచ్చగొట్టి మరింత దూరం పెంచుతున్నారు. తాము ఎందుకు గొడవ పడుతున్నామనేది 50శాతం జంటలకు తెలియదంటున్నారు పోలీసులు. మొదటి సిట్టింగ్ కౌన్సెలింగ్‌లో భార్యాభర్తలను ఒకేచోట కూర్చోబెట్టి మాట్లాడినపుడు తాము గొడవ పడేందుకు ఇంత స్వల్ప విషయం కారణమా! అనే అభిప్రాయానికి వస్తున్నారని డీసీపీ అనసూయ విశ్లేషించారు. దంపతుల తగాదాల్లో ఇరువైపుల కుటుంబ సభ్యులు జోక్యం చేసుకోకుండా ఉండటమే మేలు. మహిళలు మాత్రమే కాదు.. కొన్నిసార్లు పురుషులు కూడా గృహహింస బాధితులమేనంటూ ఫిర్యాదు చేయటం గమనార్హం.