నల్గొండ జిల్లా మర్రిగూడకు చెందిన మేకల వంశీధర్ రెడ్డి చదివింది ఐదో తరగతే. అయినా.. చోరీలు చేయటంలో జైలులో పీజీలు చేశాడు. హైదరాబాద్‌కు వలస వచ్చిన కొత్తలో సరూర్‌నగర్ ప్రాంతంలో టీస్టాల్ నడుపుకుంటూ జీవనం సాగించిన వంశీధర్‌రెడ్డి.. విలాసాలకు అలవాటు పడి డబ్బు కోసం ఇళ్ల ముందు నిలిపి ఉన్న కార్ల టైర్లను దొంగిలించేవాడు. అనంతరం ద్విచక్రవాహనాల దొంగతనం ప్రారంభించాడు. ఇదే కేసులో అరెస్టై జైలుకు వెళ్లాడు. జైలులో పరిచయమైన ఓ గజదొంగ వద్ద దొంగతనాలు చేయటంలో పాఠాలు నేర్చుకున్నాడు. జైలు నుంచి బయటకు వచ్చి చోరీలు మొదలుపెట్టిన ఈ కేటుగాడు.... ఇప్పటివరకూ దాదాపు 72 దొంగతనాలు చేసినట్లు పోలీసులు చెబుతున్నారు.
భార్య సాయంతో..
దొంగతనాలు చేసి సంపాదించిన డబ్బును భార్య సాయంతో దాచిపెట్టిన వంశీధర్... మళ్లీ అరెస్టు అయి ఖమ్మం జైలు నుంచి గత నెలలో విడుదల అయ్యాడు. బయటికి వచ్చిన వెంటనే మరో భారీ చోరీకి పథకం వేశాడు. ఈక్రమంలోనే ఈనెల 5న అల్వాల్ పరిధిలో రుక్మిణి ఎన్‌క్లేవ్‌లోని ఓ రియల్టర్ ఇంటిపై కన్నేసి.. ఎవరూ లేని సమయంలో.. అర్ధరాత్రి వేళ భారీగా నగదు, సొమ్ములను అపహరించాడు. ఇంటియజమాని ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు.. సీసీ కెమెరాల్లోని దృశ్యాల ఆధారంగా నిందితుడిని గుర్తించారు.