దా'రుణ' యాప్‌ల కేసులో గురువారం రోజున నలుగురిని అరెస్టు చేసినట్లు సైబరాబాద్ సీపీ సజ్జనార్ తెలిపారు. కీలకపాత్ర పోషించిన చైనా వాసి పరారీలో ఉన్నట్లు వెల్లడించారు. స్థానికులతో కలిసి చైనా వాసి 2 డిజిటల్ కంపెనీలు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ప్రత్యేకంగా కాల్‌సెంటర్లు ఏర్పాటు చేసి రుణాలు వసూలు చేసినట్లు పేర్కొన్నారు. మరో చైనా వాసి ఫిబ్రవరిలో వ్యాపార వీసాపై వచ్చి దందాలో పాల్గొన్నట్లు సీపీ సజ్జనార్ వెల్లడించారు. ఎప్పటికప్పుడు కొత్త కేంద్రాలు ఏర్పాటు చేసుకుంటూ వ్యాపారాన్ని విస్తరించుకున్నారని తెలిపారు. మొత్తం 11 యాప్‌లు సృష్టించి రుణాలు ఇచ్చినట్లు గుర్తించామన్నారు.
ప్రత్యేకంగా 40 ఏళ్ల లోపు ఉన్నవారిని లక్ష్యంగా చేసుకుని రుణాలిచ్చారు. రుణాలపై 25 నుంచి 30 శాతం వడ్డీ వసూలు చేసేవారు. రుణాల చెల్లింపులు ఆలస్యమైతే జరిమానా వసూలు చేసేవారు. హైదరాబాద్ నుంచి దేశవ్యాప్తంగా కార్యకలాపాలు సాగించేవారు. రుణయాప్‌లకు లక్షల్లో వినియోగదారులు ఉన్నారు. యాప్‌లకు ఎన్‌బీఎఫ్‌సీలతో సంబంధం లేదు. వ్యాపారానికి నిధులు ఎక్కడ్నుంచి వస్తున్నాయనే విషయంపై దర్యాప్తు చేస్తున్నాం. చైనా, సింగపూర్, ఇతర దేశాల నుంచి నిధులు వచ్చాయా కోణంలో ఆరా తీస్తున్నాం.