ఒకప్పటిలా ఇప్పడు మీ ఫేస్‌బుక్ ఖాతా మీ ఇష్టం కాదు...మీ వివరాలను సంకేత పదాలతో సైబర్ నేరస్థులు వారి ఇష్టానుసారంగా మార్చుకుంటున్నారు. ఇప్పటికే వేలమంది ఫేస్‌బుక్ ఖాతాలను తమకు అనుగుణంగా మార్చుకుని రూ. వేలల్లో నగదు బదిలీ చేసుకున్నారు. అసభ్యమైన చిత్రాలను సైతం పోస్ట్ చేసి వాటి ద్వారా బ్లాక్‌మెయిల్ చేసి మరీ డబ్బు డిమాండ్ చేస్తున్నారు. హైదరాబాద్, బెంగళూరు నగరాల్లో సైబర్ నేరస్థులు రోజుకు 50 మంది నుంచి 100మంది ఫేస్‌బుక్ ఖాతాల పేర్లను స్వల్పంగా మార్చి అవసరమైనప్పుడు నేరాలకు పాల్పడుతున్నారని సైబర్ క్రైమ్ పోలీస్ అధికారులు తెలిపారు.
ప్రకటన కర్తలనూ..
ఫేస్‌బుక్ ఐడీలను సంపాదిస్తున్న సైబర్ నేరస్థులు ఫేస్‌బుక్ ఖాతాలో వ్యాపార ప్రకటనలు పెడుతున్న వారినీ వదలడం లేదు. మీ ఖాతాలు మాయం చేస్తామంటూ హెచ్చరిస్తున్నారు. డబ్బులిస్తేనే ఖాతాను పునరుద్ధరిస్తామని చెబుతున్నారు. బెంగళూరులోని ఫేస్‌బుక్ సైబర్‌క్రైమ్ నుంచి మాట్లాడుతున్నామని, మీ పేరు, వివరాలను తెలుసుకునే వీలుందని వివరిస్తున్నారు. ఇంకా నమ్మకం లేకపోతే... మీరు నాతో మాట్లాడ్డం ఆపేసిన వెంటనే మీ ఫేస్‌బుక్ ఖాతా మొత్తం మాయమవుతుందంటూ బెదిరిస్తున్నారు. దీంతో కొందరు భయపడి నేరస్థుడు సూచించిన ఖాతాలకు నగదు బదిలీ చేస్తున్నారు. ఇలా నెల వ్యవధిలో 15మంది బాధితులు సైబర్‌క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు. ఫేస్‌బుక్ ఖాతాను మాయం చేయడం సాంకేతికంగా సాధ్యం కాదంటూ పోలీసులు వారిని ఊరడించి పంపుతున్నారు.