తెలంగాణ

telangana

ETV Bharat / city

Free Wifi Cyber Crime: ఉచిత వై-ఫై హ్యాకర్లకు వరం.. నేరాలకు ఊతం.. - ఉచిత వైఫైతో పొంచి ఉన్న సైబర్ ముప్పు

Free Wifi Cyber Crime: మీరు ఉచిత వై-ఫై వినియోగిస్తున్నారా?. అయితే మీరు ప్రమాదాలను ఆహ్వానిస్తున్నట్టే... మీ వైఫై నెట్‌వర్క్‌లోకి సైబర్‌ నేరస్థులు వచ్చేస్తున్నారు. మీ నెట్‌వర్క్‌లోకి ప్రవేశించి హాట్‌స్పాట్‌ను వినియోగిస్తున్న వారందరి డేటాను తస్కరిస్తున్నారు. డెబిట్‌, క్రెడిట్‌కార్డుల వివరాలు, ఫేస్‌బుక్‌, ఇన్‌స్టా ఖాతాల్లోకి చొరబడి నేరాలకు పాల్పడుతున్నారు. ఆ విధంగా మాయగాళ్లు హ్యకింగ్​ చేస్తున్నారో మీరు చూసేయండి.

Free WiFi
Free WiFi

By

Published : Jun 15, 2022, 12:59 PM IST

Free Wifi Cyber Crime: హైదరాబాద్‌, బెంగుళూరు, దిల్లీ, ముంబయి నగరాల్లో కొద్దినెలల నుంచి సైబర్‌ నేరాలు క్రమంగా పెరుగుతున్నాయి. దేశవ్యాప్తంగా 6,100 రైల్వేస్టేషన్లలో ఉచితంగా వై-ఫై సౌకర్యం అందించడంతో మరిన్ని నేరాలు పెరుగుతున్నాయి. సైబర్‌నేరాలు, అంతర్జాల వినియోగం, సాఫ్ట్‌వేర్‌ పరిజ్ఞానం ఉన్నవారే ఇవన్నీ చేస్తున్నారని పోలీసులు చెబుతున్నారు. సైబర్‌ నేరస్థులు బాధితులను బెదిరిస్తుండటం, వ్యక్తిగత విషయాలు బహిర్గతం చేస్తామంటూ హెచ్చరిస్తుండటంతో చాలామంది బాధితులు నిందితులకు నగదు బదిలీ చేస్తున్నారని, అందుకే ఈ నేరాల తీవ్రత కనిపించడంలేదన్నారు.

క్షణాల వ్యవధిలో వివరాలు...ఉచిత వై-ఫై నెట్‌వర్క్‌లోని సైబర్‌ నేరస్థులు సాధారణ వినియోగదారుల్లానే ప్రవేశిస్తారు. వై-ఫై సౌకర్యం కల్పిస్తున్నవారి సర్వర్లలోకి చొరబడతారు. దీన్నే సాంకేతిక పరిభాషలో మ్యాన్‌ ఇన్‌ మిడిల్‌ అటాక్‌గా సైబర్‌ నిపుణులు చెబుతున్నారు. ఇదంతా చేస్తోంది దిల్లీ, ముంబయిలలో ఉంటున్న హ్యాకర్లని పోలీసులు అనుమానిస్తున్నారు. వీరు సైబర్‌ నేరస్థులకు వివరాలను ఇచ్చి వారితో నేరాలు చేయిస్తున్నారు. హ్యాకర్‌కు వై-ఫై కనెక్టివిటీ వచ్చాక చరవాణులు, లాప్‌టాప్‌ ద్వారా నెట్‌వర్క్‌లోకి వైరస్‌లు, స్పామ్‌వేర్‌లు పంపుతారు. తద్వారా వ్యక్తుల పాస్‌వర్డ్‌లు తెలుసుకుంటున్నారు. ప్రతి ఒక్కరి ఫోన్‌ నంబర్లు, మెయిల్‌ చిరునామాలు, ఇంటర్నెట్‌ బ్యాంకింగ్‌, ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాల వివరాలు, పాస్‌వర్డ్‌లు తీసుకుంటారు. ఆపై ఎస్‌బీఐ నెట్‌ బ్యాంకింగ్‌ సౌకర్యం ఉన్న వ్యక్తులను ఎంచుకుని వారిపై దాడులు చేస్తున్నారు. హ్యాకర్లు మెయిల్స్‌ను హ్యాక్‌ చేస్తుండడంతో సందేశాలు పంపించినా హ్యాకర్లకే చేరుతున్నాయని గుర్తించిన ఎస్‌బీఐ కొద్దినెలల నుంచి అప్రమత్త సందేశాలు పంపించడం మానేసింది.

ఇలా చేయండి...ఉచిత వై-ఫైని రైల్వేస్టేషన్లు, బస్‌స్టాండ్లలో ఉపయోగిస్తుంటే మీ ఫోన్‌ నుంచి నెట్‌ బ్యాంకింగ్‌ ద్వారా లావాదేవీలు నిర్వహించకూడదు. బహిరంగ ప్రదేశాలు, జనసమ్మర్థ ప్రాంతాల్లో ఉచిత వై-ఫైని వినియోగించకూడదని ముంబయి పోలీస్‌ కమిషనర్‌ సంజయ్‌పాండే అభ్యర్థించారు. ఉచిత వై-ఫై ప్రాంతాలున్న చోట్ల హ్యాకింగ్‌ బారిన పడకూడదంటే చరవాణిలో ‘ఆటోమేటిక్‌ కనెక్టివిటీ’, బ్లూటూత్‌ను ఆపేయాలి. వీపీఎన్‌ను ఉపయోగించాలి. అత్యవసర పరిస్థితులు, అనుకోని అవసరాలతో ఎక్కడైనా వై-ఫై వినియోగించుకోవాలని అనిపించినప్పుడు సురక్షితమైన వై-ఫై నెట్‌వర్క్‌లను ఎంచుకోవాలి. ప్రజలు, ప్రయాణికులను ఆకర్షించేందుకు రెండు, మూడేళ్లుగా ఆర్టీసీ బస్‌స్టాండ్‌లు...రైల్వేస్టేషన్లు, విమానాశ్రయాల్లో వై-ఫై సౌకర్యం కల్పిస్తున్నారు. అక్కడి నెట్‌వర్క్‌ను పరిశీలించాలి.

నగదు బదిలీలు... బ్లాక్‌మెయిలింగ్‌..

ప్రజారవాణా సంస్థలు, హోటళ్లు, రైల్వేస్టేషన్లు, బస్టాండ్లు ఇతర వై-ఫై హాట్‌స్పాట్‌లలోకి ప్రవేశిస్తున్న హ్యాకర్లు డేటాను తస్కరిస్తున్నారు. ఫోన్‌ నంబర్లు, మెయిల్‌ ఖాతాలు, ఇతర వివరాల ఆధారంగా యువతులు, విద్యార్థులు, సాఫ్ట్‌వేర్‌, ఫార్మాకంపెనీలు, ప్రైవేటు, కార్పొరేటు సంస్థల్లో విధులు నిర్వహిస్తున్న అధికారులు, సిబ్బందిని ఎంపిక చేసుకుంటున్నారు. తర్వాత వారి ఇంటర్నెట్‌ బ్యాంకింగ్‌ పాస్‌వర్డ్‌లను తెలుసుకుని బాధితులకు తెలియకుండా బ్యాంక్‌ ఖాతాల్లో ఎంతుంటే అంత నగదుబదిలీ చేసుకుంటున్నారు. విద్యార్థులను బ్లాక్‌మెయిల్‌ చేసి రూ.వేలు, రూ.లక్షల్లో నగదు వసూలు చేసుకుంటున్నారు.

ఇవీ చదవండి:కొత్త చదువుల లోకం.. భిన్నమైన కోర్సులపై విద్యార్థుల ఆసక్తి..

ABOUT THE AUTHOR

...view details