ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కేంద్ర పన్నుల్లో రాష్ట్రాల వాటాను కేంద్ర ఆర్థికశాఖ విడుదల చేసింది. 15వ ఆర్థిక సంఘం సిఫారసులకు అనుగుణంగా రాష్ట్రాలకు రూ.46, 038 కోట్లు విడుదల చేసిన కేంద్రం... తెలంగాణ వాటాగా రూ.982 కోట్లు ఇచ్చింది. దీంతో రాష్ట్రానికి రావాల్సిన నిధుల్లో భారీగా కోత పడింది. కేంద్ర బడ్జెట్‌లో పేర్కొన్న ప్రకారం 15వ ఆర్థిక సంఘం నివేదిక ఆధారంగా రాష్ట్రాలకు కేంద్ర పన్నుల్లో వాటాగా ఏప్రిల్ నెలకు రూ.65, 348 కోట్లు ఇవ్వాల్సి ఉంది. అయితే కేంద్రం ఆ పరిమాణాన్ని రూ.46, 038 కోట్లకు కుదించింది.
భారీగా తగ్గిన నిధులు
అన్ని రాష్ట్రాలకు రావాల్సిన నిధుల పరిమాణంపైనా ఆ ప్రభావం పడింది. ఆయా రాష్ట్రాలకు ఏప్రిల్ నెలకు గాను కేంద్ర పన్నుల్లో వాటాగా రావాల్సిన నిధులు భారీగా తగ్గాయి. వాస్తవంగా రాష్ట్రానికి ఏప్రిల్ నెలకు గాను కేంద్ర పన్నుల్లో వాటాగా 1,393 కోట్ల రూపాయలు రావాల్సి ఉంది. మొత్తం పరిమాణం రూ.19,310 కోట్లు తగ్గినందున రాష్ట్రానికి రావాల్సిన నిధుల్లోనూ రూ.411 కోట్ల రూపాయలు తగ్గి.. రూ. 982కోట్లు మాత్రమే వచ్చాయి. రాష్ట్ర వాటా అయిన రూ.1,393 కోట్లలో 29.5శాతం నిధులు తగ్గాయి. ఆంధ్రప్రదేశ్‌కు రూ.2,686కోట్లు రావాల్సి ఉండగా... రూ.1,892కోట్లు వచ్చాయి. లాక్‌డౌన్ కారణంగా తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న రాష్ట్రాలకు ఈ పరిణామం సంకటంగా మారింది.