పంటల సాగుకు పెట్టుబడి ఖర్చులు రోజురోజుకూ పెరుగుతుండటంతో రైతులపై తీవ్ర ఆర్థిక భారం పడుతోంది. గతేడాదితో పోలిస్తే అన్ని ఖర్చులూ పెరిగాయని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విత్తనాలు, పురుగు మందులు మొదలుకొని దుక్కులు, ఇతర పనులకు వినియోగించే వాహనాల దాకా అన్నింటికి గతేడాదికన్నా రేట్లు పెరిగాయి. ప్రస్తుతం దుక్కుల పనులు ముమ్మరంగా సాగుతుండటంతో ట్రాక్టర్లకు గిరాకీ పెరిగింది. డీజిల్ రేటు పెరగడం వల్ల ట్రాక్టర్లకు కిరాయిలు పెంచుతున్నారని రైతులు వాపోతున్నారు.
ఎకరానికి రూ.3 వేలు ఖర్చు అదనం
నేను ఆరెకరాల్లో పత్తి సాగు చేస్తున్నాను. గతేడాదికన్నా ఈసారి అన్ని రేట్లు పెరిగాయి. కరోనా వల్ల రోజు కూలీ పెరిగింది. ఎకరానికి కనీసం రూ.3 వేలకు తగ్గకుండా ఖర్చులు పెరిగాయి. అప్పులు తెచ్చి పెట్టుబడులు పెడుతున్నాం. రైతుబంధు సొమ్ము ఇంకా రాలేదు.
- కాడె నారాయణ, పత్తి రైతు, తలమడుగు గ్రామం, ఆదిలాబాద్ జిల్లా
రూ.వందల కోట్ల ఆర్థిక భారం
వ్యవసాయశాఖ అధ్యయనం ప్రకారం ఎకరా వరి పొలంలో ట్రాక్టర్ దుక్కులకు రూ.4 వేలు ఖర్చవుతుంది. ప్రాంతాన్ని బట్టి గతేడాది కన్నా రూ.200 పెంచి.. 800 నుంచి 1000 రూపాయల దాకా తీసుకుంటున్నారు. ఎకరానికి రెండు మూడు సార్లు దుక్కులకు కలిపి అదనంగా రూ.400 చొప్పున ట్రాక్టర్ రేటు పెరిగింది. రాష్ట్రంలో 1.25 కోట్ల ఎకరాల్లో ప్రస్తుతం పంటలు సాగవుతాయని వ్యవసాయశాఖ అంచనా. అదనంగా రూ. వందల కోట్ల ఆర్థిక భారం రైతులపై పడింది. దీని ప్రభావంతో అన్ని రకాల పెట్టుబడి ఖర్చులు పెరుగుతాయని ములుగు జిల్లాకు చెందిన ఓ మండల వ్యవసాయాధికారి ‘ఈనాడు’కు చెప్పారు. గతేడాదితో పోలిస్తే ఎకరానికి కనిష్ఠంగా రూ.వెయ్యి ఖర్చు పెరిగినా మొత్తం 1.25 కోట్ల ఎకరాలకు రైతులు భరించాల్సిన సొమ్ము సుమారు రూ.1200 కోట్లు అదనంగా ఉంటుందన్నారు.