Telangana Rains: భారీ వర్షాలు, వరదలపై కలెక్టర్లు, ఎస్పీలతో సీఎస్ సమీక్ష - cs somesh Kumar review
![Telangana Rains: భారీ వర్షాలు, వరదలపై కలెక్టర్లు, ఎస్పీలతో సీఎస్ సమీక్ష cs-somesh-kumar-teleconference-on-telangana-heavy-rains](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-12536373-1001-12536373-1626943862149.jpg)
13:35 July 22
గోదావరి పరివాహక జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో సీఎస్ సమీక్ష
భారీ వర్షాల నేపథ్యంలో ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా యుద్ధప్రాతిపదికన తగిన సహాయ, పునరావాస చర్యలు చేపట్టాలని అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, అధికారులను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ఆదేశించారు. గోదావరి పరివాహక 16 జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో సీఎస్ టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. డీజీపీ మహేందర్ రెడ్డి, వివిధ శాఖల ఉన్నతాధికారులు కూడా టెలికాన్ఫరెన్స్లో పాల్గొన్నారు.
గండ్లు పడకుండా చర్యలు...
పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని... అన్ని జిల్లాల్లో కంట్రోల్ రూంలు ఏర్పాటు చేయాలని సీఎస్ ఆదేశించారు. అవసరమైతే లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని చెప్పారు. అన్ని శాఖలు పూర్తి సమన్వయంతో పనిచేయాలని, చెరువులకు ఎలాంటి గండ్లు పడకుండా చర్యలు తీసుకోవాలని తెలిపారు.
ప్రభుత్వం తరపున సహకారం..
తాగునీరు, విద్యుత్ సరఫరా, పారిశుధ్య నిర్వహణకు ప్రాధాన్యం ఇవ్వాలని సోమేశ్ కుమార్ అధికారులకు స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున అవసరమైన సహకారం అందిస్తామన్న సీఎస్... విపత్తు నిర్వహణా శాఖ ప్రత్యేక కార్యదర్శి రాహుల్ బొజ్జాకు వివరాలు అందించాలని ఆదేశించారు.