PM Modi Hyderabad Tour: ఈ నెల 26న హైదరాబాద్‌లో ప్రధాని నరేంద్రమోదీ పర్యటించనున్న దృష్ట్యా.. పటిష్టమైన ఏర్పాట్లు చేయాలని అధికారులను సీఎస్ సోమేశ్‌కుమార్ ఆదేశించారు. ప్రధానమంత్రి పర్యటన నేపథ్యంలో ఏర్పాట్లపై సీఎస్ ఉన్నత స్థాయి సమీక్ష చేశారు. ఈ సమావేశంలో డీజీపీ మహేందర్ రెడ్డి, పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్‌కుమార్, గృహ నిర్మాణ శాఖ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సునీల్ శర్మ, హోం శాఖ ముఖ్య కార్యదర్శి రవి గుప్తా, ఆరోగ్య శాఖ కార్యదర్శి ఎస్‌ఏఎం రిజ్వి, అగ్నిమాపక శాఖ డీజీ సంజయ్ కుమార్ జైన్, రంగారెడ్డి జిల్లా కలెక్టర్ అమయ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
పర్యటనలో పోలీసు బందోబస్తు, బలగాల మోహరింపు, ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయం వంటి అంశాలపై అధికారులు విస్తృతంగా చర్చించారు. ఈ నెల 26న గచ్చిబౌలి ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్- ఐఎస్‌బీలో జరిగే ఓ కార్యక్రమంలో ప్రధాని మోదీ ముఖ్య అతిధిగా పాల్గొంటున్నారని వెల్లడించారు. ఎస్పీజీ సమన్వయంతో వివిధ శాఖలు పటిష్టమైన ఏర్పాట్లు చేపట్టాలని ఆదేశాలు జారీ చేశారు. ప్రధాని పర్యటన సందర్భంగా ప్రోటోకాల్ అనుసరించి పటిష్టమైన ఏర్పాట్లు చేపట్టాలని ప్రధాన కార్యదర్శి సోమేష్‌కుమార్ సూచించారు.
మరోవైపు ప్రధాని మోదీ పర్యటనను విజయవంతం చేసేందుకు భాజపా రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ కుమార్ కసరత్తు ప్రారంభించారు. పార్టీ పరంగా చేపట్టాల్సిన కార్యక్రమాలపై నేతలతో చర్చలు జరుపుతున్నారు. ఇప్పటికే బండి సంజయ్ కుమార్ చేపట్టిన రెండో విడత ప్రజా సంగ్రామ యాత్ర విజయవంతం కావడంతో పాటు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, పార్టీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా రాష్ట్ర పర్యటనలు పెద్ద ఎత్తున విజయవంతం కావడంతో రాష్ట్ర పార్టీ నాయకులు, శ్రేణుల్లో కొత్త ఉత్సాహం నెలకొంది. తాజాగా ప్రధాని రాష్ట్రానికి వస్తున్న సమాచారం అందడంతో భాజపా శ్రేణుల్లో మరింత జోష్ నెలకొంది. ఈ పరిణామాల నేపథ్యంలో ప్రధాని మోదీ రాష్ట్ర పర్యటనను కనివినీ ఎరగని రీతిలో దిగ్విజయం చేసే దిశగా బండి సంజయ్ కసరత్తు చేస్తున్నారు. అందులో భాగంగా బేగంపేట ఎయిర్ పోర్టులో ప్రధానికి ఘన స్వాగతం పలికేలా బండి సంజయ్ ఏర్పాట్లు చేస్తున్నారు. జంట నగరాల్లో పెద్ద ఎత్తున ప్రధానికి స్వాగతం పలుకుతూ భారీ ఎత్తున ఫ్లెక్సీలను ఏర్పాటు చేసేందుకు సిద్దమయ్యారు. మొత్తంమీద అగ్రనేతల రాకతో జాతీయ నాయకత్వం తెలంగాణపై ప్రత్యేక దృష్టి పెట్టిన నేపథ్యంలో తెలంగాణలో భాజపా గెలుపు ఖాయమనే సంకేతాలను కూడా ప్రజల్లోకి తీసుకెళ్లేలా కార్యాచరణ రూపొందిస్తున్నారు.
ఇవీ చూడండి: