CS Somesh Kumar Review: రాష్ట్రంలో 80,039 ఉద్యోగాల భర్తీకి త్వరలోనే ఉత్తర్వులు జారీ చేస్తామని సీఎస్ సోమేశ్‌కుమార్ తెలిపారు. దీనికి అనుగుణంగా వరుసగా నోటిఫికేషన్లు జారీ అవుతాయన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు త్వరలోనే నియామక సంస్థలను ఖరారు చేసి.. త్వరితగతిన ప్రక్రియ పూర్తయ్యేందుకు కార్యాచరణ చేపడతామన్నారు. న్యాయపరమైన సమస్యలు రాకుండా ప్రతి శాఖ అప్రమత్తంగా వ్యవహరించాలని, ఒక్క పోస్టు కూడా నిలిచిపోయే పరిస్థితి రావద్దన్నారు. ఉద్యోగ నియామకాల ప్రక్రియ సన్నాహాలపై గురువారం సీఎస్ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఉద్యోగాల భర్తీ ప్రక్రియలో పోస్టుల వారీగా నియామక సంస్థల ఎంపిక, తొలి నోటిఫికేషన్ తేదీ తదితర అంశాలను సీఎస్ శుక్రవారం లేదా శనివారం సీఎం కేసీఆర్‌కు నివేదించి, ఆయన ఆమోదం తీసుకోనున్నారని తెలుస్తోంది.
CS Somesh Kumar Review: 'బోర్డుల ద్వారా ఉద్యోగాల భర్తీ.. సన్నద్ధం కండి' - సీఎం కేసీఆర్
17:02 March 17
ఉద్యోగ నియామకాలపై సీఎస్ సమీక్ష.. ఆయా శాఖల ఉన్నతాధికారులు హాజరు
అన్నింటికి ఆర్థిక శాఖ ఆమోదం ఇప్పిస్తాం
సమీక్ష సమావేశంలో సీఎస్ మాట్లాడుతూ.. ‘‘మున్ముందు నియామకాలకే అన్ని ప్రభుత్వ శాఖలు ప్రాధాన్యం ఇవ్వాలి. ప్రత్యేకంగా నోడల్ అధికారిని నియమించి దీని కోసం ఆర్థికశాఖకు సమాచారం ఇవ్వాలి. పబ్లిక్ సర్వీసు కమిషన్ పరిధిలో పోస్టులుంటే వారికి సమాచారం ఇవ్వాలి. ఖాళీలు, సర్వీసు నిబంధనల మేరకు అభ్యర్థుల అర్హతలు, రిజర్వేషన్లు, రోస్టర్ తదితర సమాచారం ఆర్థికశాఖకు శాఖలు అందిస్తే వెంటనే అనుమతి ఇస్తాం. ఆ వెంటనే సంబంధిత నియామక సంస్థ నోటిఫికేషన్ జారీ చేస్తుంది. ఒకేసారి మొత్తంగా గాకుండా ఒకదాని తర్వాత ఒకటి చొప్పున తగిన వ్యవధితో నోటిఫికేషన్లు వస్తాయి. దీనికి అనుగుణంగా అన్ని శాఖలు సమన్వయంతో వ్యవహరించాలి. ఏ విషయంలోనూ గందరగోళానికి తావీయవద్దు’’ అన్నారు. సమావేశంలో ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, సాధారణ పరిపాలనశాఖ ముఖ్యకార్యదర్శి వికాస్‌రాజ్, విద్య, వైద్యశాఖ కార్యదర్శులు సందీప్ కుమార్ సుల్తానియా, రిజ్వీ, హోంశాఖ ముఖ్యకార్యదర్శి రవిగుప్తా, న్యాయశాఖ కార్యదర్శి సంతోష్‌రెడ్డి. పబ్లిక్ సర్వీసు కమిషన్ ఛైర్మన్ జనార్దన్‌రెడ్డి, పోలీసు నియామక బోర్డు ఛైర్మన్ వీవీ శ్రీనివాసరావు, ఉన్నతవిద్యామండలి ఛైర్మన్ లింబాద్రి తదితరులు పాల్గొన్నారు.
తొలి ప్రకటన పోలీస్ శాఖ నుంచి
సమీక్ష సమావేశంలో పోలీసుశాఖ అధికారులు తాము 18 వేలకు పైగా నియామకాలకు సర్వసన్నద్ధంగా ఉన్నామని తెలియజేయగా...ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు అతి త్వరలో మంచిరోజు చూసి నోటిఫికేషన్ ఇచ్చేందుకు సన్నద్ధం కావాలని సీఎస్ సూచించారు. అంటే తొలి నోటిఫికేషన్ పోలీసు శాఖ నుంచి వెలువడనుంది. మరోవైపు టెట్ నిర్వహణతో పాటు ఉపాధ్యాయుల పోస్టుల భర్తీకి డీఎస్సీ నిర్వహణ కోసం, వైద్యఆరోగ్యశాఖ పరిధిలోని వైద్యులు, సిబ్బంది నియామకాలను ఆ శాఖ బోర్డు చేపట్టేందుకు సైతం ప్రాథమిక నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది. విశ్వవిద్యాలయాల ఖాళీల భర్తీకి ప్రత్యేక బోర్డును ఏర్పాటు చేసి భర్తీ చేయాలని నిర్దేశించారు. గురుకులాల ప్రత్యేక బోర్డు ద్వారా వాటి పరిధిలోని పోస్టులను భర్తీ చేస్తారు. గ్రూపు పోస్టులను భర్తీకి సన్నద్ధం కావాలని సీఎస్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఛైర్మన్‌ను కోరారు.
ఇదీ చూడండి: