ధాన్యం కొనుగోళ్లపై సీఎస్ సమీక్ష.. సాఫీగా సాగుతోందని అధికారుల వివరణ.. - paddy procurement in telangana
14:01 May 05
ధాన్యం కొనుగోళ్లపై సీఎస్ సమీక్ష.. సాఫీగా సాగుతోందని అధికారుల వివరణ..
ధాన్యం కొనుగోళ్ల వివరాలను ఏ రోజుకు ఆ రోజు నమోదు చేయాలని... అపుడే రైతులకు త్వరగా చెల్లింపులు సాధ్యమవుతాయని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ అధికారులకు తెలిపారు. యాసంగి ధాన్యం కొనుగోళ్లపై పౌరసరఫరాల శాఖ అధికారులతో సీఎస్ సమీక్ష నిర్వహించారు. ధాన్యం సేకరణ సాఫీగా సాగుతోందన్న పౌరసరఫరాల శాఖ కమిషనర్ అనిల్ కుమార్... ఇప్పటి వరకు 3679 కేంద్రాల ద్వారా 61,300 మంది రైతుల నుంచి 4.61 లక్షల మెట్రిక్ టన్నులు సేకరించినట్లు వివరించారు. మరో 31 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణకు సరిపడా గన్నీ బ్యాగులు అందుబాటులో ఉన్నాయని చెప్పారు. 7.8 కోట్ల గన్నీ బ్యాగులు సిద్ధంగా ఉన్నాయని... 8 కోట్ల గన్నీ బ్యాగుల కోసం ఇవాళ టెండర్లు ఖరారవుతాయని తెలిపారు. మరో రెండున్నర కోట్ల గన్నీ బ్యాగులు జ్యూట్ కార్పోరేషన్ నుంచి త్వరలోనే వస్తాయని చెప్పారు.
పొరుగు రాష్ట్రాల నుంచి ధాన్యం రాకుండా 17 సరిహద్దు జిల్లాల్లో 51 చెక్ పోస్టులు ఏర్పాటు చేసినట్లు అధికారులు వివరించారు. రైతులకు వీలైనంత త్వరగా చెల్లింపులు చేసేలా ధాన్యం కొనుగోలు వివరాలను ఎప్పటికప్పుడు నమోదు చేయాలని సీఎస్ అధికారులకు స్పష్టం చేశారు. డబ్బుకు ఎలాంటి ఇబ్బంది లేదని, 5000 కోట్ల రూపాయలు సిద్ధం చేసినట్లు చెప్పారు. సేకరించిన ధాన్యాన్ని వెంటనే మిల్లులకు తరలిస్తున్నామని... ఇప్పటి వరకు 4.3 లక్షల మెట్రిక్ టన్నులు మిల్లులకు తరిలించామని, పెండింగ్ లేదన్నారు. వరంగల్, గద్వాల, వనపర్తి, భూపాలపల్లి, నాగర్ కర్నూల్ జిల్లాల్లో ఇంకా కోతలు పూర్తి కాలేదని... కోతలు ప్రారంభమైన వెంటనే ఆయా జిల్లాల్లోనూ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తామని సీఎస్ సోమేశ్ కుమార్ తెలిపారు.
ఇవీ చూడండి: